పంతులయ్య …..ఇది మీకు తగునా.,…
విద్యార్థుల….. బాల కార్మికుల
చదువుకోవాలని వెళితే పెట్టి చాకిరి తప్పలేదు….
ఆవేదన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు…
అదిలాబాద్ బ్యూరో జనంసాక్షి :
పాఠశాలకు చదువుకోమని తల్లిదండ్రులు పంపిస్తే అక్కడ ఉన్న ఉపాధ్యాయులు చదువు చెప్పడం మానేసి విద్యార్థులచే పనులు చేయించడం ఎంతవరకు సమంజసం అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే విద్యార్థులను బాల కార్మికులు గా తయారు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే అదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని పొన్నారి గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో గురువారం పాఠశాల సిబ్బంది విద్యార్థులచే పనులు చేయించిన సంఘటన చోటు చేసుకోవడంతో పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యాబుద్ధులు నేర్పవలసిన ఉపాధ్యాయులు గురువారం పాఠశాలలో జరుగుతున్న ఒక కార్యక్రమానికి విద్యార్థులచే కుర్చీలు మొయించి కార్యక్రమానికి వచ్చిన వారికి నీళ్లు అందిస్తూ పనులు చేయడం తీవ్ర విమర్శలకు భావిస్తుంది. అక్కడికి వచ్చినవారు చదువుకోడానికి వచ్చారా లేక బాల కార్మికుల అన్న సందేహం కలగడం విశేషం. బాల కార్మిక వ్యవస్థను రూపుమాపాలని రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి బడి బయట ఉన్న పిల్లలను బల్లో చేర్పించడానికి అష్ట కష్టాలు పడి ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే సంకల్పంతో పనిచేస్తున్నాయి. కానీ ఈ విషయం తెలిసి కూడా ఉపాధ్యాయులు విద్యార్థులను బాల కార్మికులుగా తయారు చేస్తున్నారంటే వారు ఎంత మాత్రం విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుతున్నారో అవగతం అవుతుంది. ఇలాంటి నిర్లక్ష్య వైఖరి ఉన్న ఉపాధ్యాయులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులు కోరుతున్నారు. చదువుకోవడానికి పాఠశాలకు పంపిస్తే మా పిల్లలచే పనులు చేయించడం ఏమిటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఉపాధ్యాయుల లంచ్ బాక్సులు అడగడం వారికి కావలసిన నీళ్లు మోయడం పాఠశాలలో కసునూకడం ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు పనులు చేయించుకోవడం వంటి పనులు ఉపాధ్యాయులు జిల్లా వ్యాప్తంగా పాఠశాలల్లో పనులు చేయిస్తూ బాల కార్మికులుగా విద్యార్థులను తయారు చేస్తున్నారు. చదువుకోవాలన్న విద్యార్థుల ఆశలు ఇలాంటి నిర్లక్ష్య వైఖరి కలిగిన ఉపాధ్యాయుల వల్ల సోమరులుగా తయారవుతున్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు ఇలాంటి ఉపాధ్యాయులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులు కోరుతున్నారు.