పక్కాగా ఓటర్ల తుది జాబితా రూపకల్పనకు సహకరించాలి
వచ్చే నెల 2, 3 తేదీలలో ఓటర్ల నమోదు, మార్పులు-చేర్పులకై ప్రత్యేక శిబిరాలు
…… డిఆర్ ఓ నగేష్
సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి , ఆగస్టు 28 :::::
త్వరలో జరుగనున్న సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జిల్లాలో పక్కాగా ఓటర్ల తుది జాబితా రూపొందేలా చర్యలు తీసుకుంటున్నామని , ఇందుకు రాజకీయ పార్టీలు తమవంతు సహకారం అందించాలని డిఆర్ఓ నగేష్ కోరారు.
సోమవారం కలెక్టరేట్ లోని తన చాంబర్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై ముసాయిదా ఓటరు జాబితా,ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాల ఏర్పాటు తదితరాలను వివరించారు.
ఓటరు డ్రాఫ్ట్ రోల్ కు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే సెప్టెంబర్ 19 వరకు స్వీకరించడం జరుగుతుందని, అక్టోబర్ 04 న తుది ఓటరు జాబితాను ప్రచురించడం జరుగుతుందని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని డ్రాఫ్ట్ ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలిస్తూ, ఎక్కడైనా పొరపాట్లు ఉంటే వాటిని సంబంధిత ఈ.ఆర్.ఓల దృష్టికి తేవాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు.
కొత్తగా ఓటరు జాబితాలో పేర్ల నమోదు, మార్పులు-చేర్పులకు ఇంకనూ అవకాశం ఉన్నందున అర్హులైన వారు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు.
ఈ దిశగా ప్రజల సౌకర్యార్ధం జిల్లాలో ఈ నెల 26, 27 తేదీలలో ప్రత్యేక శిబిరాలను నిర్వహించగా, ఐదు నియోజకవర్గాలలో మొత్తం ఫారం – 6 (15114), ఫారం -7 (122), ఫారం – 8 (907) వచ్చాయని వారికి తెలిపారు.
అదేవిధంగా వచ్చేనెల 2 ,3 తేదీల్లో ప్రత్యేక శిబిరాలు ఉంటాయని తెలిపారు.
ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద బూత్ లెవెల్ అధికారులు అందుబాటులో ఉంటారని, ఓటరు జాబితాలో పేర్ల నమోదు, ఇతర మార్పులు, చేర్పులకు సంబంధించిన నిర్ణీత నమూనా దరఖాస్తుఫారాలు వారి వద్ద అందుబాటులో ఉంటాయన్నారు. వాటిని పూరించి బీ.ఎల్.ఓలకు అందజేయవచ్చని సూచించారు. ఈ విషయమై విస్తృత ప్రచారం నిర్వహిస్తూ, ప్రత్యేక శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చొరవ చూపాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు.
కొత్త ఓటర్ల నమోదుతో పాటు ఓటరు జాబితాలో పేర్ల తొలగింపును నిశితంగా పరిశీలించి ఎక్కడైనా పొరపాటు జరిగినట్లు గుర్తిస్తే, వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తేవాలన్నారు.
ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.