పగబట్టిన ప్రకృతి

భారీ వర్షాలతో సహాయానికి అడ్డంకి
కూలిన హెలీక్యాప్టర్‌, 19 మంది మృతి
సామూహిక అంత్యక్రియలకు ఏర్పాట్లు
డెహ్రాడూన్‌, జూన్‌ 25 (జనంసాక్షి) :
ఉత్తరాఖండ్‌పై ప్రకృతి మరోసారి పగబట్టింది. గత వారం విరుచుకుపడి కోలుకోలేని దెబ్బ తీసిన వరుణుడు మళ్లీ విజృంభించాడు. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ఉత్తరాఖండ్‌పై ప్రతాపం చూపుతున్నాడు. వేలాది మంది యాత్రికులను పొట్టనబెట్టుకున్న వరదలు మళ్లీ కాలనాగుల్లా పోటెత్తుతున్నాయి. ఉత్తర కాశీలో రెండ్రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సహాయక చర్యలు నిలిచిపోయాయి. ఉత్తర కాశీ, చమోలీ, డెహ్రాడూన్‌, జాలిగ్రంట్‌, కుమోన్‌ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం వరకు పంత్‌నగర్‌లో 15 సెంటీమీటర్లు, ముసోరిలో 14, డెహ్రాడూన్‌లో 12 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షానికి మట్టిరోడ్డు పూర్తిగా పూర్తిగా బబురదమయం కావడంతో కనీసం దానిపై నడవలేని స్థితి నెలకొంది. మరో మూడ్రోజుల వరకూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మరింత ఆందోళన నెలకొంది. అటు సహాయక చర్యలతో పాటు ఇటు మృతదేహాల ఖననానికి వర్షం వల్ల అంతరాయం కలుగుతోంది. ఇప్పటికే వేలాది మందిని రక్షించినా.. కొండకోనల్లో మరో పది వేల మంది వరకూ ఉంటారని అంచనా. వారిని రక్షించేందుకు సైన్యం, వైమానిక దళం తీవ్రంగా కృషి చేస్తున్నా.. వర్షాలతో పాటు వాతావరణం సహకరించక పోవడంతో ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో వారిని రక్షించేందుకు సహాయక చర్యలు మరింత ఆలస్యమయ్యే అవకాశముందని అటు వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన హెలికాప్టర్లు వాతావరణం అనుకూలించక రెండో రోజూ సహస్రధారకే పరిమితమయ్యాయి. సోన్‌ ప్రయాగ నుంచి గుప్త కాశీ వరకూ సహాయక చర్యలు నిలిచిపోయాయి. కొండచరియలు విరిగిపడుతుండడంతో సహాయక చర్యల్లో నిమగ్నమైన 8 వేల మంది సైనికులు నిస్సహాయులుగా ఉండిపోయారు.వర్షం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హర్షిల్‌ గంగోత్రి నుంచి మంగళవారం 430 మంది యాత్రికులను సహాయక సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సంగ్లా లోయ, కిన్నార్‌, నాకో ప్రాంతాల్లో ఇంకా పలువురు చిక్కుకొని ఉన్నారు. బద్రినాథ్‌లో ఇంకా ఐదు వేల మందికి పైగానే చిక్కుకుపోయారు. హర్షిల్‌లో మరో 1200 మంది దాకా ఉన్నారు. బాధితులంతా తిండీతిప్పల్లేకుండా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకోని సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.
కేదార్‌నాథ్‌లో సహాయక చర్యలు పూర్తి
ప్రముఖ శైవక్షేత్రం కేదార్‌నాథ్‌లో సహాయక చర్యలు పూర్తయ్యాయని అధికారులు ప్రకటించారు. భారీ వర్షాలు పోటెత్తడంతో కేదార్‌నాథ్‌ తుడిచిపెట్టుకుపోయింది. వేలాది మంది యాత్రికులు వరదల్లో చిక్కుకుపోయారు. రంగంలోకి దిగిన సైన్యం, వైమానిక దళ సిబ్బంది వారిని సుక్షితంగా తరలించారు. కేదార్‌నాథ్‌లో యాత్రికుల తరలింపు మంగళవారంతో పూర్తయిందని, ఇంకా అక్కడ యాత్రికులు ఎవరూ లేరని అధికారులు చెప్పారు. కేదార్‌నాథ్‌లో యాత్రికులు ఎవరూ లేరని రక్షణ, పారామిలిటరీ సిబ్బంది చెప్పారన్నారు. ‘కేదార్‌నాథ్‌, పరిసర ప్రాంతాల్లోని అడవుల్లో బాధితులు ఎవరూ లేరు. అక్కడ చిక్కుకున్న వారందరినీ సురక్షితంగా తరలించామని’ సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న అధికారి రవినాథ్‌ తెలిపారు. రాంబడ, గౌరికుండ్‌, కేదార్‌నాథ్‌లలో ఉన్న సహాయక సిబ్బంది వెనక్కు తిరిగిస్తున్నారని చెప్పారు. ఇంకా ఎవరైనా చిక్కుకున్నారేమోనని వైమానిక దళం, పారామిలిటరీ సిబ్బంది ఆడవుల్లో గాలిస్తున్నారు. అయితే, యాత్రికులు ఎవరూ లేరని, చిక్కుకున్న వారందరినీ తరలించామన్నారు.
కేదార్‌నాథ్‌ ఎమ్మెల్యేపై స్థానికుల దాడి
వరద బాధితులకు సహాయక చర్యలు చేపట్టడంలో ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం విఫలమైందని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కేదార్‌నాథ్‌ ఎమ్మెల్యే శైలారాణిపై మంగళవారం దాడి చేశారు. వరద ప్రాంతాల్లో పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యేలను స్థానికులు తరిమితరిమి కొట్టారు. ప్రాణభాయంతో శైలారాణి రావత్‌ అడవిలో తలదాచుకున్నారు.
సహాయక చర్యలు ముమ్మరం చేయండి : సుప్రీం కోర్టు ఆదేశం
న్యూఢల్లీి : ఉత్తరాఖండ్‌ వరదల్లో చిక్కుకున్న వారికి సహాయక చర్యలు ముమ్మరంగా అందించాలని సుప్రీం కోర్టు కేంద్రం ప్రభుత్వాన్ని ఆదేశించింది. వరదల్లో చిక్కుకున్న వారిలో ఇప్పటివరకూ 96,500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడిరచింది. బాధితులందరికీ ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నామని, వారికోసం 4 వేల వాహనాలు ఏర్పాటు చేశామని మంగళవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తరాఖండ్‌ వదర బాధితుల కోసం తీసుకున్న చర్యల (ఏటీఆర్‌)పై నివేదికను కోర్టుకు సమర్పించాయి. ఉత్తరాఖండ్‌లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, వరదల్లో చిక్కుకున్న వారికి తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. వీలైనంత ఎక్కువగా సహాయక చర్యలు చేపట్టాలని సూచించింది. వరదల్లో చిక్కుకుపోయిన వారిని తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. ఉత్తరాఖండ్‌ వరదల్లో చిక్కుకున్న వారికి తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. దీన్ని విచారించిన న్యాయస్థానం సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించిన కోర్టు.. తీసుకున్న చర్యలపై ఈ నెల 25లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. ఉత్తరాఖండ్‌లో సహాయక చర్యలపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం మరోమారు విచారించింది. కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యల (ఏటీఆర్‌)పై నివేదికను కోర్టుకు సమర్పించాయి. వీలైనంత వరకూ బాధితులను అందరినీ తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించాయి. ఇప్పటివరకు 96,500 మంది యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించామని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. సైన్యానికి చెందిన 49 బృందాలు, ఆర్మీకి చెందిన 1189 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని పేర్కొంది. బాధితులందరికీ ఉచిత రవాణా సౌకర్యం కల్పించినట్లు వివరించింది. వరదల్లో చిక్కుకున్న వారిని హరిద్వార్‌, డెహ్రాడూన్‌లకు తరలించేందుకు 4 వేల వాహనాలు ఏర్పాటు చేసినట్లు తెలిపింది. నిలిచిపోయిన టెలి కమ్యూనికేషన్లను 80 శాతం పునరుద్ధారించామని పేర్కొంది. కాగా, మరో 72 గంటల్లో బాధితుల తరలింపు పూర్తి అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. 560 మంది వరకు మృతి చెందినట్లు అంచనా వేస్తున్నామని వివరించింది. ఆహారం, నిత్యావసర వస్తువులకు కొరత లేదని, 50 వేల చొప్పున వాటర్‌ బాటిళ్లు, ప్యాకెట్లు, 45 వేల బిస్కట్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. బాధితుల కోసం మొత్తం 62 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపింది. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని జస్టిస్‌ ఏకే పట్నాయక్‌, రంజన్‌ గగోయ్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. పిటిషనర్‌ సలహాలను కూడా స్వీకరించాలని సూచిస్తూ విచారణను జూన్‌ 28కి వాయిదా వేసింది.
జల ప్రళయంపై ఐరాస విచారం
ఉత్తరాఖండ్‌లో సంభవించిన ఘోర ప్రకృతి విపత్తుపై ఎట్టకేలకు ఐక్యరాజ్య సమితి స్పందించింది. భారీ వర్షాలు, వరదల్లో చిక్కుకొని పెద్ద ఎత్తున ప్రాణ ఆస్తి నష్టంపై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్‌కీ మూన్‌ విచారం వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వానికి, వరదల్లో మృతిచెందిన, గాయపడిన వారి కుటుంబాలకు ఆయన సంతాపం వ్యక్తం చేశారు. పునరావాసానికి, అత్యవసర పరిస్థితుల్లో సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఈమేరకు మూన్‌ అధికార ప్రతినిధి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
డెహ్రాడూన్‌ : వరదల్లో చిక్కుకున్న బాధితులను కేదార్‌ నుంచి తీసుకున్న ఎంఐ-17 హెలీక్యాప్టర్‌ మంగళవారం సాయంత్రం గౌరికుండ్‌ వద్ద కూలిపోయింది. యాత్రికుల సహాయ చర్యల కోసం కేదార్‌ వెళ్లి తిరిగి వస్తుండగా ఆకస్మాతుగా ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మేఘాలు చుట్టుముట్టడడంతో వాతావరణం అనుకూలించనందునే ఈప్రమాదం జరిగిందని వైమానిక అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 19 మంది మృతిచెందారని, వారిలో ఎనిమిది మంది మృతదేహాలను వెలికి తీసినట్లు జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి తెలిపారు. మృతుల్లో వైమానిక, పారామిలటరీ బలగాల సిబ్బందితో పాటు యాత్రికులు ఉన్నట్లు పేర్కొన్నారు. సహాయ చర్యలను కొనసాగిస్తామని తెలిపారు. మరో 72 గంటల్లో ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు వెల్లడిరచారు. వరదల్లో చిక్కుకుపోయిన వారికి సహాయక చర్యలు అందించేందుకు కృషి చేస్తున్నామని అధికారులు తెలిపారు.