పగలు రెక్కీ రాత్రి చోరి ..!

టెంపుల్సే టార్గెట్ ..!
వాహన తనిఖీల్లో పట్టుబడిన అంతరాష్ర్ట దొంగల ముఠా అరెస్ట్ రిమాండ్ !
రూ. 30 లక్షల విలువైన 45 కేజీల వెండి,60 గ్రాముల బంగారు ఆభరణాలు,షిఫ్ట్ కారు, సెల్ ఫోన్లు స్వాధీనం ..!
వివరాలు వెల్లడించిన డీఎస్పీ వై. వెంకటేశ్వరరావు
మిర్యాలగూడ. జనం సాక్షి
పగలు రెక్కీ వేసి రాత్రిళ్లు చోరి చేసి భారీగా వెండి, బంగారు ఆభరణాలను దోచుకెళ్లే అంతరాష్ర్ట దొంగలను వన్ టౌన్ పోలీసులు శుక్రవారం మిర్యాలగూడ పట్టణంలోని చింతపల్లి క్రాస్ రోడ్డు వద్ధ చేపట్టిన వాహన తనికీల్లో పట్టుకున్నారు. అనుమానస్పదంగా కనిపించిన కారును నిలిపి వేసి వివరాలు సేకరిస్తున్న వన్ టౌన్ పోలీసులు డిక్కీలో ఉన్న ఇనుప రాడ్డు, స్క్రూ డ్రైవర్, ఆభరణాల కట్టర్, ముఖానికి వేసుకునే ముసుగులు,చేతి గ్లౌసెస్, ఎలక్ర్టానిక్ మెల్టింగ్ మిషన్ ను గుర్తించి గట్టిగా నిలదీశారు. దీంతో కారులో ఉన్న ఇద్ధరు పరారీ అయ్యేందుకు ప్రయత్నించగా పట్టుకుని విచారిస్తే చోరీల మిస్టరీ వీడిందన్నారు. శుక్రవారం స్థానిక వన్ టౌన్ పీ ఎస్ లో డీఎస్పీ వై. వెంకటేశ్వరరావు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఏపీ లో గల వెస్ట్ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గొల్లలకోడేరు విలేజ్ గ్రామ వాసి కాళ్లకూరి కిరణ్ బాబు, ఇదే జిల్లాలోని వుండి మండల కేంద్రానికి చెందిన చొక్కాకుల సజ్జన్ రావు ఇద్ధరు ముఠాగా ఏర్పడ్డారు. వీరిద్ధరూ కలిసి 2017 నుంచి వెస్ట్ గోదావరి జిల్లాలో చోరీలు చేశారు. ఈ క్రమంలో 2020లో జైలుకు వెళ్లి డిసెంబర్ మాసంలో విడుదలయ్యారు. కొంతకాలం టెలికాం నెట్ వర్క్ సంస్థల్లో పనిచేసిన వీరు ..మళ్లీ చోరీ బాట పట్టిండ్రు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి కారులో తిరుగుతూ దేవాలయాలను టార్గెట్ చేశారన్నారు. పగలు రెక్కి వేసి రాత్రిళ్లు తమ వెంట తెచ్చుకున్న రాడ్లతో ఆలయ తాళాలు పగలగొట్టి గర్భగుడిలోని వెండి, బంగారు ఆభరణాలు, హుండిలో నగదు అపహరించినట్లు చెప్పారు. వీరిపై మిర్యాలగూడ టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 4 కేసులు నమోదు కాగా నిడమనూరు పీఎస్ _1, మహాబూబ్ నగర్, ఖమ్మం జిల్లా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆరు కేసులు,ఏపీలో 2 కేసులు కలిపి మొత్తం 13 నమోదయ్యాయన్నారు. ఖమ్మం జిల్లాలోని మధిరలో గల ఓ ఇంట్లో చోరి చేయగా మిగిలిన దొంగతనాలన్ని ఆలయాల్లో చేసినట్లు చెప్పారు. వీరి నుంచి రూ. 30 లక్షల విలువైన 45 కేజీల వెండి, 60 గ్రాముల బంగారు ఆభరణాలు, షిఫ్ట్ డిజైర్ కారు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు తెలిపారు. ఈ సమావేశంలో వన్ టౌన్ సీఐ రాఘవేందర్, క్రైం టీం ఎస్ఐ సుదీర్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ పి. వెంకటేశ్వర్లు,ఆర్. శ్రీనివాస్, పి. నాగరాజు,కొమ్ము రవి,ఎస్. వెంకటేశ్వర్లు, ఎం. రామకృష్ణ ఉన్నారు. కేసును చేధించిన వీరిని డీఎస్పీ అభినందించారు. రివార్డు కోసం పై అధికారులకు సిఫారసు చేస్తామని అన్నారు