పట్టణాల్లో నిర్దేశించిన లక్ష్యం ప్రకారం హరితహారం మొక్కలు నాటండి
మున్సిపల్ కమిషనర్ల సమావేశంలో కలెక్టర్ శ్రీహర్ష
జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) జూలై 11 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమం జిల్లాలో లక్ష్యం ప్రకారం మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.
సోమవారం జిల్లా కల్లెక్టరేట్ సమావేశము హాలు నందు హరితహారం కార్యక్రమం పై మున్సిపల్ కమిషనర్లతో సమీక్షించారు. హరితహారం క్రింద నాటిన ప్రతి మొక్కకు జియో టాకింగ్ చేయాలన్నారు. జిల్లాలోని గద్వాల, ఐజ, వడ్డేపల్లి, అలంపూర్ మున్సిపాలిటీలలో నిర్దేశించిన లక్ష్యం ప్రకారం మొక్కలు జులై చివరి నాటికి నాటాలని ఆదేశించారు. మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేసి వారి ఆధ్వర్యంలో మొక్కలు నాటి సంరక్షించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణాలలో రోడ్లు, పార్కులు, కార్యాలయాలు, ఇల్లు తదితర ప్రాంతాలలో మొక్కలు విరివిగా నాటాలని ఆదేశించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు మొక్కలు వెంటనే నాటుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రక్కన పెద్ద మొక్కలు నాటాలని వాటికి రక్షణ ఏర్పాటు చేయాలన్నారు. ఇందులో భాగంగా గట్టు మండలం చమన్ ఖాన్ దొడ్డిలో మంగళవారం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంత ప్రజలను ప్రమాదాల బారిన పడకుండా అప్రమతం చేయాలనీ తెలిపారు. ప్రస్తుతం భారీ వర్షాల నేపథ్యంలో ఐజ, వడ్డేపల్లి, అలంపూర్ ప్రాంతాలలో పురాతన ఇళ్లను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు ప్రజలను తరలించాలని కలెక్టర్ కోరారు. మున్సిపాలిటీ పరిధిలో డ్రైనేజీలు ఎప్పటికప్పుడు శుభ్రం చేసి వర్షపు నీరు పారేల చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.
ఈ సమావేశంలో జడ్పీ సీఈవో విజయ నాయక్, డి పి ఓ శ్యాం సుందర్, మున్సిపల్ కమిషనర్లు జానకి రామ్ సాగర్, నిత్యానంద్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.