పట్టుబిగించిన సఫారీలు

పెర్త్‌, డిసెంబర్‌ 1: ఆస్టేల్రియాతో జరుగుతోన్న మూడో టెస్టులో దక్షిణాఫ్రికా పట్టుబిగించింది. బౌలర్లకు అనుకూలించిన పిచ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ను కుప్పకూల్చింది. తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో రాణించి భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. 2 వికెట్లకు 33 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో ఇవాళ ఇన్నింస్త్ర్స కొనసాగించిన ఆసీస్‌ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. టాపార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ను డేల్‌ స్టెయిన్‌, ఫిలాండ్‌ పెవిలియన్‌కు పంపారు. వార్నర్‌ 13, క్లార్క్‌ 5, ల్యాన్‌ 7 పరుగులకు ఔటయ్యారు. కెరీర్‌లో ఆఖరి టెస్ట్‌ ఆడుతోన్న పాంటింగ్‌ నిరాశపరిచాడు. కేవలం 4 పరుగులకే ఔటయ్యాడు. వెంటనే మైకేల్‌ హస్సీ కూడా 12 రన్స్‌కే వెనుదిరగడంతో ఆస్టేల్రియా 100 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మాథ్యూ వేడ్‌, హాస్టింగ్స్‌ ఇన్నింగ్స్‌ నిలబెట్టే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ ఎనిమిదో వికెట్‌కు 40 పరుగులు జోడించారు. ఈ క్రమంలో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న వేడ్‌ 68 పరుగుల స్కోర్‌ ఔటయ్యాడు. తర్వాత జాన్సన్‌, హాస్టింగ్స్‌ కూడా ఔటవడంతో ఆసీస్‌ ఇన్నింగ్స్‌కు 163 పరుగుల దగ్గర తెరపడింది. దక్షిణాఫ్రికాకు 62 పరుగుల ఆధిక్యం లభించింది. సఫారీ బౌలర్లలో స్టెయిన్‌ 4, పీటర్సన్‌ 3, ఫిలాండర్‌ 2, మోర్కెల్‌ 1 వికెట్‌ తీసుకున్నారు. వెంటనే రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన సౌతాఫ్రికా 28 పరుగుల దగ్గర ఓపెనర్‌ పీటర్సన్‌ వికెట్‌ కోల్పోయింది. అయితే స్మిత్‌, ఆమ్లా ఆసీస్‌ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్నారు. పిచ్‌ క్రమంగా బ్యాట్స్‌మెన్‌కు అనుకూలించడంతో సునాయాసంగా పరుగులు సాధించారు. ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్‌ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. స్మిత్‌, ఆమ్లా రెండో వికెట్‌కు 178 పరుగుల పార్టనర్‌షిప్‌ నమోదు చేశారు. దీంతో సఫారీ ఇన్నింగ్స్‌ సాఫీగా సాగింది. ఈ సమయంలో 13 ఫోర్లతో 84 పరుగులు చేసిన స్మిత్‌ను స్టార్క్‌ పెవిలియన్‌కు పంపాడు. దీంతో సౌతాఫ్రికా రెండో వికెట్‌ కోల్పోయింది. ఆమ్లా, కల్లిస్‌ ఇన్నింగ్స్‌ కొనసాగించారు. రెండో రోజు ఆటముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 2 వికెట్లకు 230 పరుగులు చేసింది. ఆమ్లా 99, కల్లిస్‌ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం సఫారీ టీమ్‌ 292 పరుగుల ఆధిక్యంలో ఉంది.