పట్నం పోదాం.. పాలకులను నిలదీద్దాం కోదండరామ్‌

హైదరాబాద్‌, జూన్‌ 11 (జనంసాక్షి) :
పట్నం పోదాం పాలకులను నిలదీద్దామంటూ తెలంగాణ ప్రజలకు టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ పిలుపునిచ్చారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో కేజేఆర్‌ గార్డెన్స్‌లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న కోదండరామ్‌ మాట్లాడారు. తెలంగాణ కోసం అసెంబ్లీలో తీర్మానం చేసేందుకు వెనకాడుతూ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీ పాలకుల మెప్పుకోసం పాకులాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ తీర్మానం పెట్టమని అన్నాక కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడడం లేదన్నారు. సీఎంను వారు ఎందుకు నిలదీయరని ప్రశ్నించారు. టిడిపి అధినేత చంద్రబాబు ఒక్కసారైనా తెలంగాణ కోసం పోరాడారా? ఆత్మబలిదానాలు చేసుకున్న వారి కుటుంబ సభ్యులను పరామర్శించారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా చలో అసెంబ్లీ నిర్వహించి తీరుతామన్నారు. ఎన్ని పికెట్లు ఏర్పాటు చేసుకున్నా, ఎంతమందిని బైండోవర్ల పేరుతో ఠాణాల్లో నిర్బంధించిన చలో అసెంబ్లీ ఆగబోదన్నారు. తెలంగాణ ప్రజలను ప్రభుత్వం, పోలీసులు రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకుల తీరు మార్చుకొని అనుమతినిస్తే శాంతియుతంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. కాదూ కూడదంటే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి, పోలీసుల తీరు నియంతల్లా వ్యవహరిస్తున్నారని ప్రజలు వారికి తగిన రీతిలో బుద్ధి చెబుతారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుతోనే తెలంగాణ ఏర్పాటు కోసం విద్యార్థులు, యువత ప్రాణత్యాగాలకు సిద్ధపడ్డారని తెలిపారు. కాంగ్రెస్‌ అగ్రనేతలు, సీమాంధ్ర నేతల రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇప్పటికైనా మానుకోవాలని హితవు పలికారు. పాలకుల తీరు మార్చుకోకుంటే ఫలితం అనుభవించక తప్పదని అన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఆకాంక్షను చాటేందుకు ప్రజలు పెద్దఎత్తున ఈ నెల 14న చేపట్టనున్న చలో అసెంబ్లీ కార్యక్రమానికి తరలిరావాలని  పిలుపునిచ్చారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ మోసపూరిత విధానాలకు నిరసనగానే ఆందోళనలు జరుగుఉతన్నాయని అన్నారు. అలాగే 14 చేపట్టే చలో అసెంబ్లీని అడ్డుకుంటే ఊరుకోబోమని హెచ్చరించారు. తెలంగాణ రాజకీయ ఐకాస  14న తలపెట్టిన చలో అసెంబ్లీని విజయవంతం చేయాలని కోరారు. ప్రజాస్వామ్యంలో నిరసన చేపట్టే హక్కు ప్రజలకు ఉంటుందన్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా బైండోవర్లు, ముందస్తు అరెస్టులతో బెదిరించినా వెనక్కి తగ్గేదిలేదన్నారు. పోలీసు బలగాలతో ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో ఓట్లు వేసేది పోలీసులు కాదు ప్రజలేనన్న విషయం పాలకులు గుర్తుంచుకోవాలని సూచించారు. సమావేశంలో బండారు దత్తాత్రేయ, శ్రీనివాస్‌, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.