పత్తి రైతు ఆత్మహత్య
ఖమ్మం,అక్టోబర్17(జనంసాక్షి): పత్తి సేద్యం ఓ రైతు ఉసురు తీసింది. నష్టాలు తప్పేలా లేవన్న బాధతో కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సేద్యాన్నే నమ్ముకున్న ఆ రైతు కౌలుకు తీసుకొని పంటలను సాగుచేశాడు. కాలం కలిసిరాక, అప్పులు పేరుకుపోయాయి. వీటిని తీర్చే మార్గం లేదని భావించాడు. మనస్తాపంతో కుంగిపోయాడు. మానసిక వత్తిడికిలోనై కౌలురైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా బోనకల్ మండలం లక్ష్మీపురంలో జరిగింది. దాసరి ప్రభుదాసు (35) రెండు సంవత్సరాల నుంచి భూమిని కౌలుకు తీసుకొని పంటలను సాగు చేస్తున్నాడు. గతసంవత్సరం నాలుగు ఎకరాల్లో మిరప సాగుచేశాడు. కాలం కలిసిరాక, గిట్టుబాటు ధరలు లభించక అప్పులయ్యాయి. వీటిని తీర్చాలనే ఉద్దేశంతో మరో నాలుగు ఎకరాల్లో పత్తి సాగుచేశాడు. అకాల వర్షం వల్ల పత్తిపంట దెబ్బతినటంతో పదిరోజుల నుంచి మనస్తాపానికి గురయ్యాడు. పంటల సాగుకు చేసిన అప్పులు ఎలా తీరుతాయని ఆలోచనతోకుంగిపోయాడు. పొలం నుంచి ఇంటికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆత్మహత్యతో గ్రామంలో పలువురు విచారం వ్యక్తం చేశారు.