పథకం ప్రకారమే హత్య …డీఎస్పీ జైపాల్ రెడ్డి
బాన్సువాడ పట్టణ కేంద్రంలోని సంగమేశ్వర కాలనీ లో ఈనెల 17న రాత్రి సాయిలును రామకృష్ణ వర్గం హత్య చేసారని బాన్సువాడ డి.ఎస్.పి జైపాల్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన పట్టణ కేంద్రంలోని పోలీసుస్టేషన్లో పాత్రికేయుల సమావేశంలో హత్య కేసు వివరాలను వెల్లడించారు. బాన్స్వాడ పట్టణ కేంద్రంలోని సంగమేశ్వర కాలనీ లో నగేష్, సాయిలు ,రామకృష్ణ రెండు వర్గాలు సెప్టిక్ క్లీనర్స్ తో సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేసే వారని. ఈ క్రమంలో నగేష్, సాయిలు తన మిత్రబృందంతో కలిసి నూతన సెప్టిక్ ట్యాంకు కొనుగోలు చేసి బతుకుదెరువు కోసం ఉపాధి వెతుక్కున్నారు. సెప్టిక్ ట్యాంక్ క్లీనర్ వ్యాపారం అడ్డుకోవాలనే దురుద్దేశంతో రామకృష్ణ వర్గం పలుమార్లు సాయిలును బెదిరించి భయాందోళనలకు గురి చేశారని తెలిపారు. ఈనెల 17న బీర్కుర్ మండలం అన్నారం గ్రామంలో సాయిలు, నగేష్ లు సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసేందుకు వెళ్లిన తరుణంలో అక్కడ గొడవపడి రామకృష్ణ వర్గం దాడికి పాల్పడ్డారని దీంతో బీర్కుర్ పోలీస్ స్టేషన్లో రామకృష్ణ వర్గంపై కేసు నమోదైందన్నారు. అదే రోజు రాత్రి సుమారు పదిన్నర గంటల ప్రాంతంలో సాయి కృప కాలనీకి చెందిన మిద్దె లక్ష్మి ఇంటి వద్ద సెప్టిక్ ట్యాంక్ ను శుభ్రం చేసేందుకు వెళ్లిన సాయిలు పై రామకృష్ణ వర్గం ఎనిమిది మంది కలిసి కత్తులు,కర్రలతో దాడి చేసి కిరాతకంగా హతమార్చారని పేర్కొన్నారు. సాయిలు ఒంటిపై 17 కత్తిపోట్లు అయినట్లు వెల్లడించారు. మండల పరిధిలోని కోనాపూర్ గ్రామ శివారులో ఈనెల 21న బాన్స్వాడ పట్టణ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఐడి పార్టీ బృందం సభ్యులు ఎనిమిది మందిని పట్టుకొని అరెస్టు చేసారని వెల్లడించారు .అరెస్టయినవారిలో రామకృష్ణ, దండు బాబు, పిల్లి సాయిలు, గణేష్,భువనేశ్ ,రాములు ,లోకేష్ ,పోచయ్య ఉన్నారు. ఈ సమావేశంలో బాన్సువాడ గ్రామీణ సి ఐ మరి పాక మురళి, ఏ ఎస్ ఐ దత్తాత్రి గౌడ్, ఐడి పార్టీ బృందం సభ్యులు తదితరులు ఉన్నారు.