పదవుల కోసమేనా ఆరాటం?

తెలంగాణ ప్రాంతంలోని కొందరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, మంత్రులను చూస్తుంటే వీరు ఈ గడ్డపై పుట్టిన వారేనా అనే అనుమానం కలుగుతోంది. పౌరుషాల పోరుగడ్డ, ఎందరో అమరుల కన్నభూమిపై నడిచిన వారేనా ఇలా వ్యవహరించేది అనే సందేహం కలుగుతోంది. పది జిల్లాల్లోని ఊరువాడ, ఇళ్లిళ్లు ఉద్యమ బాటన నడస్తుంటే వీరుమాత్రం తమ ప్రయోజనాల కోసమే ఆరాటపడుతున్నారు. కొందరు మంత్రులు, చిన్నపాటి పదవులు వెలగబెడుతున్న వారు జై తెలంగాణ అన్న వారిపై ఎదురుదాడికి దిగుతున్నారు. మరకొందరేమో తెలంగాణ ఇచ్చేది, తెచ్చేది తామే అంటూ ఢాంబికాలు పలుకుతున్నారు. 2009 డిసెంబర్‌ 23న కేంద్రం తెలంగాణపై ఇచ్చిన మాట తప్పిన తర్వాత ఇంతెత్తున లేచి పార్టీ అధిష్టానాన్నే ధిక్కరించిన నేతలు తర్వాత చల్లబడ్డారు. నల్గొండ జిల్లాకు చెందిన రాంరెడ్డి దాయోదర్‌రెడ్డి, కుందూరు జానారెడ్డి, వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే బస్వరాజు సారయ్య రెచ్చిపోయి మాట్లాడారు. తెలంగాణ ఇవ్వకుంటే అది చేస్తాం.. ఇది చేస్తామంటూ హెచ్చరికల మీద హెచ్చరికలు జారీ చేశారు. మంత్రివర్గంలో చోటు దక్కించుకోవాలనే ఉత్సాహంతోనే వీరంతా ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఆ తర్వాతనే అర్థం అయింది. జానారెడ్డి, సారయ్య ఆమాత్యులుగా ప్రమాణ స్వీకారం చేయగా, ఖమ్మం జిల్లా నుంచి దామోదర్‌రెడ్డి సోదరుడు వెంకటరెడ్డి మంత్రిగా ఉండటంతో ఆయనకు భంగపాటు ఎదురైంది. మంత్రి పదవి దక్కకపోవడంతో తీవ్ర నైరాశ్యం చెందిన దామోదర్‌రెడ్డి మీడియా ఎదుట కనిపించకుండా పోయాడు. ఉన్నట్టుండి రెండు రోజుల క్రితం మీడియా ముందుకు వచ్చిన పేపర్‌ టైగర్‌ తెలంగాణ ప్రాంత ఎంపీలు, ఎమ్మెల్యేలు ఫ్రంట్‌గా ఏర్పడి పార్టీ వీడనున్నట్లు బాంబు పేల్చారు. తెలంగాణమార్చ్‌కు ముందు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం స్తబ్దంగా ఉంది. సాగరహారం విజయవంతం కావడంతో అప్పటి వరకు మొద్దు నిద్రలో ఉన్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు నిద్ర లేచారు. 2014 ఎన్నికలు ముంచుకొస్తుండటం, రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో తెలియని స్థితిలో ఉండటంతో వారికి అసెంబ్లీలో అడుగు పెడతామో, లేదోననే భయం పట్టుకుంది. ఈనేపథ్యంలో ఎలాగైనా శాసనసభలో అడుగుపెట్టాలనే తలంపుతో మళ్లీ తెలంగానం ఆలపిస్తున్నారు. పార్టీని వీడుతాం, ఫ్రంట్‌ పెడతాం, ఇంకా ముందుకు వెళ్లి పార్టీని పెడతాం అనే ప్రకటనలు గుప్పిస్తున్నారు. వీరి ప్రకటనల్లో ఇసుమంతైనా నిజాయితీ కనిపించడం లేదు. పార్లమెంట్‌లో ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ సాక్షిగా తెలంగాణ నినాదాలు చేసిన ఎంపీలను తప్ప వేరే ఎవరిని నమ్మే స్థితిలో ఇక్కడి ప్రజలు లేరు. ఎవరు ఎందుకు ఎలా మాట్లాడుతున్నారో తెలుసుకోలేని వారు ఉంటారనుకోవడం వారి భ్రమే. ఈనేపథ్యంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, నేతల తాజా ప్రకటనలు జోకుల్లా పేలుతున్నాయే తప్ప ఎవరినీ ఆకట్టుకోవడం లేదు. వారికి మొన్నటి వరకు ముఖ్య అనుచరులుగా ఉన్న వారు కూడా స్థానిక ఎన్నికలే లక్ష్యంగా పార్టీని వీడి ఉద్యమ బాట పట్టారు. దీంతో పునాదులు కదులతాయని భావించిన నేతలు నిస్సిగ్గుగా కొత్త పల్లవి అందుకున్నారు. మంత్రి పదవులు వెలగబెడుతున్న వారు టీ కాంగ్రెస్‌ ఎంపీలు, టీ జేఏసీ ఆధ్వర్యంలో ఏవైనా ఉద్యమాలు చేపడితేనే అధిష్టానం తమ చెవిలో చెప్పిందని, త్వరలో తెలంగాణ వస్తుందని చెబుతూ పబ్బం గడుపుతున్నారు. ఇక్కడ అర్థం కాని విషయమేమంటే ఎంపీలు ఢిల్లీలో ఉంటారు. అధిష్టానవర్గంలోని ముఖ్యులు వారికి రోజూ కనిపించి మాట్లాడుతుంటారు. ఒక్కోసారి అమ్మగారి దర్శన భాగ్యం కూడా కలుగుతుంది. ఒక మాటో అరమాటో మాట్లాడుతారు కూడా. ఉంటే గింటే సంకేతాలు వారికే ఉండాలి. కానీ హైదరాబాద్‌లో ఉన్న మంత్రులు, విప్‌లు, ఎమ్మెల్యేలకు ఢిల్లీ నుంచి ఎలా సంకేతాలు అందుతాయో తెలియడం లేదు. ఎవరు వీరికి ఢిల్లీ ముచ్చట్లు చెవిలో చెబుతారో ఎంతకూ అర్థం కాదు. ఎంపీలకు లేని సంకేతాలు, వారికి తెలియని కదలికలు హైదరాబాద్‌లో ఉన్న వారికి తెలుస్తాయా అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. సంకేతాలే ఉంటే ఎంపీలు ఎందుకు పార్లమెంట్‌ లోపల, వెలుపల ధర్నాలు చేస్తారు అనేది తెలియడం లేదు. తమను పార్టీ విడిచి రమ్మంటున్నారని సోమవారం ఎంపీ మందా జగన్నాథం విలేకరులకు తెలిపారు. అంటే వారు సొంత ఎజెండాతో ముందుకు సాగుతున్నారని అనుకోవాలా. ముఖ్యమంత్రి విసిరిన అధికారపు వలలో చిక్కుకున్న ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, నేతలు చేస్తున్నది విష ప్రచారమా? వస్తవమా? అనేది వారికే తెలియాలి.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అవసరం లేదంటూ ముఖ్యమంత్రి మౌత్‌పీస్‌ జగ్గారెడ్డి మాట్లాడిన మాటల సారాంశం ఇక్కడి మంత్రులకు ఆలస్యంగా గాని తెలిసిరాలేదు. జరుగుతున్న నష్టాన్ని పూడ్చుకునేందుకు కొందరు మంత్రులు మైకుల ముందుకువచ్చి మరీ జగ్గారెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. కొందరు ఆయనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వారి ఆగ్రహంలో నిజాయితీ ఉందా అని తెలంగాణ ప్రజలు తరచి చూసుకుంటున్నారంటే వారి తాప్రతయం ఏమిటో తెలియకపోదు. ప్రజల విశ్వాసాన్ని చూరగొనలేకపోయిన నేతలు ప్రజాస్వామ్యంలో మనలేరు. మరి మన నేతలు ఇంకా అధికారం వెంటే పరుగులు తీస్తారో? ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటారో? తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.