పదోతరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
వరంగల్,మార్చి12(జనంసాక్షి): ఈ నెల 15వ తేదీ నుంచి జరుగనున్నపదో తరగతి పబ్లిక్ పరీక్షలకు జిల్లా అధికారులు పక్కాగా ఏర్పాట్లు చేశారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 : 45 నిమిషాల వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే పరీక్షా కేంద్రాలకు హాజరయ్యే విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ అధికారులు పలు సూచనలు జారీ చేశారు. పరీక్షా ప్రారంభానికి ఒక గంట ముందు నుంచే అంటే ఉదయం 8:30 గంటల నుంచే విద్యార్థులను పరీక్ష హాల్‌లోకి అనుమతి ఇస్తారు. విద్యార్థులు స్కూల్ యూనిఫాంలో పరీక్షా కేంద్రాలకు రాకూడదు. విద్యార్థులు తమ వెంట హాల్ టికెట్, పరీక్ష ప్యాడ్‌ను తీసుకు రావాలి. సెల్‌ఫోన్‌లు ఇతర ఎలక్టాన్రిక్ పరికరాలు పరీక్ష హాల్‌లోకి అనుమతించరు. ఉదయం 9 : 30 గంటల తర్వాత విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించడం జరగదు. విద్యార్థులు హాల్ టికెట్లను ఇంటర్‌నెట్
నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న హాల్ టికెట్లతో కూడా విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. హాల్ టికెట్‌పై ఫొటో ప్రింట్ కాకపోతే ఒక ఫొటోనే అతికించి ఎవరైనా గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. పరీక్షలు జరిగేటప్పుడు మారుమూల గ్రామాల్లోని కేంద్రాలకు బస్సులు నడపాలని కలెక్టర్ సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద వైద్య సిబ్బంది సైతం అందుబాటులో ఉంటారు. పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వం విద్యాప్రమాణాల పెంపునకు ప్రత్యేక కృష్టి చేస్తొందన్నారు. పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో ఉపాధ్యాయుల కొరత, తాగునీరు, భోజనం ఇలా ప్రతి ఒక్కటి పూర్తి స్థాయిలో సమకూర్చుకునేలా దృష్టి సారిస్తామన్నారు. స్థానిక
ప్రజాప్రతినిధులు ప్రభుత్వ బడుల సమస్యలపై దృష్టి సారించి అధికారుల సహకారంతో పరిష్కరించుకోవాలని సూచించారు.