పదోతరగతి ఫలితాలు విడుదల
– వరంగల్ ఫస్ట్, హైదరాబాద్ లాస్ట్
– బాలికలదే హవా
హైదరాబాద్,మే11(జనంసాక్షి): తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు నేడు విడుదలైయ్యాయి. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పరీక్ష ఫలితాలను బుధవారం విడుదల చేశారు. ఫలితాల్లో మళ్లీ బాలికలే టాప్ లేపారు. వరంగల్ ప్రథమ స్థానంలో నిలవగా, హైదరాబాద్ చివరన నిలిచింది. 95.13 శాతం ఉత్తీర్ణతతో వరంగల్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. కాగా రెండో స్థానంలో మహబూబ్‌నగర్, మూడో స్థానంలో మెదక్ జిల్లాలు ఉండగా చివరి స్థానంలో హైదరాబాద్ నిలిచింది.మొత్తం 5,55,265 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవ్వగా 4,44,828 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గతేడాదికంటే ఉత్తీర్ణత 8 శాతం పెరిగింది. 121 ప్రభుత్వ పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. పది పాఠశాలలు సున్నా ఫలితాలను సాధించాయి. మార్చి 21 నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకు జరిగిన పదో తరగతి పరీక్షలకు 5.6 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. గతేడాది పరీక్షలు ముగిసిన 38 రోజుల తర్వాత ఫలితాలు విడుదల చేయగా… ఈ ఏడాది రికార్డుస్థాయిలో 32 రోజుల్లోనే ఫలితాలు ప్రకటించారు. తెలంగాణ పదోతరగతి ఫలితాల్లో 85.63 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి తెలిపారు. పదో తరగతి పరీక్షలకు మొత్తం 5,55,265 మంది విద్యార్థులు హాజరుకాగా 4,44,828 మంది ఉత్తీర్ణులయ్యారు. 2015లో 77.56 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా ఈ సంవత్సరం ఉత్తీర్ణత 8 శాతం పెరిగింది. బాలురు 84.70 శాతం పాస్
కాగా, బాలికలు 86.57 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురు కంటే బాలికల ఉత్తీర్ణత శాతం 1.87 అధికంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 2,370 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. 10 పాఠశాలలు సున్నా ఫలితాలు సాధించాయి. ఇదిలావుంటే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 15 నుంచి 29 వరకు నిర్వహించనున్నారు.
ఎమ్మెల్యేల తిరుగుబాటు, పార్టీ ఫిరాయింపులు, రెబెల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయడం, మెజార్టీ లేదంటూ కేంద్రం రాష్ట్రపతి పాలన విధించడం, రెబెల్స్, సర్కార్ ఒకరికి వ్యతిరేకంగా మరొకరు కోర్టును ఆశ్రయించడం, ఈ మధ్యలో ఎమ్మెల్యేలతో బేరసారాలకు పాల్పడ్డారంటూ స్టింగ్ ఆపరేషన్ వీడియోలు వెలుగుచూడటం.. ఇలా ఎన్నో రాజకీయ మలుపులు తిరిగిన ఉత్తరాఖండ్లో పదవీచ్యుత ముఖ్యమంత్రి హరీశ్ రావత్ అధికారికంగా విజయం సాధించారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో హరీశ్ మెజార్టీ నిరూపించుకున్నట్టు సుప్రీం కోర్టు బుధవారం అధికారికంగా ప్రకటించింది. బలపరీక్షలో హరీశ్ సర్కార్కు అనుకూలంగా 33 ఓట్లు పడగా, వ్యతిరేకంగా 28 ఓట్లు పడ్డాయి. ముఖ్యమంత్రిగా హరీశ్ బాధ్యతలు చేపట్టేందుకు సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, ఇందుకు వీలుగా ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తామని కేంద్రం తరపున అటార్నీ జనరల్ సుప్రీం కోర్టుకు తెలిపారు. దీంతో ఉత్తరాఖండ్ రాజకీయ సంక్షోభానికి తెరపడినట్టయింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఉత్తరాఖండ్ అసెంబ్లీలో మంగళవారం బలపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వివరాలను సీల్డు కవర్లో సుప్రీం కోర్టుకు సమర్పించగా, ఈ రోజు ఫలితాన్ని ప్రకటించింది.
ఉత్తరాఖండ్ అసెంబ్లీలో మొత్తం 70 మంది ఎమ్మెల్యేలు ఉండగా తొమ్మిదిమంది కాంగ్రెస్ రెబెల్స్పై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. దీంతో మిగిలిన 61 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్లో పాల్గొన్నారు. వీరిలో బీజేపీకి 28, కాంగ్రెస్కు 27, బీఎస్పీకి ఇద్దరు, ఉత్తరాఖండ్ క్రాంతి దళ్కు ఓ ఎమ్మెల్యే, మరో ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఉన్నారు. కాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే రేఖ ఆర్య బీజేపీ గూటికి చేరగా, బీజేపీ ఎమ్మెల్యే భీమ్ లాల్ ఆర్య కాంగ్రెస్లోకి జంప్ అయ్యారు. ఇక బీఎస్పీ అధినేత్రి మాయావతితో పాటు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు మద్దతు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన తొమ్మిదిమంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో హరీశ్ రావత్ ప్రభుత్వం మైనార్టీలో పడిన సంగతి తెలిసిందే. మార్చి 27 న రాష్ట్రపతి పాలన విధించారు.