పదో రోజుకు చేరిన సీఎం రమేశ్‌ దీక్ష

– విషమంగా మారుతున్న ఆరోగ్య పరిస్థితి
– తేల్చి చెప్పిన వైద్యులు
– దీక్షాశిబిరాన్ని సందర్శించిన మాజీ ఐపీఎస్‌ లక్ష్మీనారాయణ
కడప, జూన్‌29(జనం సాక్షి) : కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ రాజ్యసభ ఎంపీ సీఎం రమేశ్‌ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష శుక్రవారంతో పదో రోజుకు చేరుకుంది. కేంద్రం నుంచి స్పష్టమైన హావిూ వచ్చేవరకు దీక్ష విరమించేది లేదని రమేశ్‌ చెబుతుండటంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. మరోవైపు శుక్రవారం ఉదయం రిమ్స్‌ వైద్యులు సీఎం రమేశ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన ఆరోగ్యం అంతకంతకూ క్షీణిస్తోందని.. తక్షణ వైద్యసాయం అవసరమని సూచించారు. సీఎం రమేశ్‌ దీక్షకు మద్దతుగా జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చిన సంఘీభావం ప్రకటిస్తున్నారు. సినీ నిర్మాత బండ్ల గణెళిశ్‌ సీఎం రమేశ్‌ను పరామర్శించి మద్దతు ప్రకటించారు. మరోవైపు ఎమ్మెల్సీ బీటెక్‌ రవికి రిమ్స్‌ లో వైద్య చికిత్స అందిస్తున్నారు.
దీక్షకు మాజీ ఐపీఎస్‌ లక్ష్మీనారాయణ సంఘీభావం…
ఉక్క పరిశ్రమ కోసం దీక్ష చేస్తున్న ఎంపీ సీఎం రమేష్‌ను మాజీ ఐపీఎస్‌ లక్ష్మీనారాయణ, నిర్మాత బండ్ల గణెళిశ్‌ పరామర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఎంపీ సీఎం రమేష్‌ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నా ఉక్కుదీక్షను కొనసాగించడం అభినందనీయమని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం ఉక్కు కర్మాగారంపై వెంటనే ప్రకటన చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.  మరోవైపు ఎంపీ రమేష్‌ ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తుండటంతో కుటుంబసభ్యులు, టీడీపీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. దీక్షాశిబిరం వద్దకు బారీగా తరలివస్తున్నారు. మరోవైపు శుక్రవారం రాత్రి కానీ, శనివారం కానీ రమేష్‌ దీక్షను భగ్నం చేసి ఆస్పత్రికి తరలించేందుకు సన్నద్ధం అవుతున్నారు.