పద్మశ్రీ వనజీవి రామయ్య ఇకలేరు
` గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ గుండెపోటుతో మృతి
` కోటి మొక్కలు నాటి రికార్డు సృష్టించిన ప్రకృతి ప్రేమికుడు
` సీఎం రేవంత్‌రెడ్డి, ప్రధాని మోదీ, పలువురు ప్రముఖుల సంతాపం
ఖమ్మం(జనంసాక్షి): మొక్కలే శ్వాసగా…మొక్కలే జీవితంగా..మొక్కలే ప్రాణంగా బతికిన ప్రముఖ సామాజిక కార్యకర్త, పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామయ్య శనివారం ఉదయం గుండెపోటు రావడంతో మృతి చెందారు. కుటుంబ సభ్యులు ఆయనను ఖమ్మం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. రామయ్య స్వస్థలం ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామం. జీవితమంతా మొక్కలు నాటి పెంచారు. కోటికిపైగా మొక్కలు నాటి సరికొత్త చరిత్ర సృష్టించారు. వృక్షో రక్షతి రక్షితః అంటూ నిత్యం ప్రచారంచేసిన ఆయన రోడ్ల పక్కన, పాఠశాలలు, దవాఖానలు, దేవాలయాల్లో మొక్కలు నాటారు. రామయ్య సేవలకుగాను 2017లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. రామయ్యకు భార్య, ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. కాగా ఇద్దరు కుమారులు ఇప్పటికే వివిధ కారణాలతో చనిపోయారు. రామయ్య మృతితో ప్రకృతి ప్రేమికులు శోక సంద్రంలో మునిగిపోయారు. రామయ్యను కడసారి చూడటానికి జనం భారీగా తరలి వచ్చారు. బీఆర్‌ఎస్ మాజీ ఎంపీ సంతోష్, సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క సహా పలువురు రాజకీయ నేతలు రామయ్య మృతిపట్ల సంతాపం తెలిపారు. 1937, జూలై 1న దరిపెల్లి లాలయ్య, పుల్లమ్మ దంపతులకు రామయ్య జన్మించారు. ఆయన ఇంటిపేరు దరిపల్లి రామయ్య అయినప్పటికీ వనజీవిగా మార్చుకున్నారు. ఆయనను చెట్ల రామయ్య అనికూడా పిలుస్తారు. 50 ఏండ్లుగా అలుపెరగకుండా విత్తనాలు చల్లుతూ మొక్కలు పెంచేందుకు ప్రయత్నించారు. వేసవిలో విత్తనాలు సేకరించి తొలకరి రాగానే వాటిని ఆయా ప్రాంతాల్లో చల్లుతుండేవారు. ఇలా 120 రకాల మొక్కల చరిత్రను అలవోకగా చెప్పగలరు వనజీవి. మూడు కోట్ల మొక్కలు నాటాలన్నదే తన లక్ష్యమని వనజీవి రామయ్య చెప్తుండేవారు. తెలంగాణ ప్రభుత్వం ఆరో తరగతి సాంఫీుకశాస్త్రంలో వనజీవి గురించి పాఠ్యాంశంగా చేర్చింది. అదేవిధంగా మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడి తెలుగు విద్యార్థుల కోసం 9వ తరగతి తెలుగు పుస్తకంలో రామయ్య జీవితం పాఠ్యాంశంగా బోధిస్తున్నది.రామయ్యకు భార్య జానమ్మ, నలుగురు సంతానం. ఓవైపు కుటుంబ భారాన్ని మోస్తూనే.. నాలుగు దశాబ్దాలకు పైగా మొక్కలు నాటుతూ వచ్చారు. మనుమళ్లు, మనుమరాళ్లకు కూడా ఆయన చెట్ల పేర్లే పెట్టారు. ఒకామె పేరు చందనపుష్ప, ఇంకో మనుమరాలు హరిత లావణ్య. కుబంధపుష్ప అని ఇంకో పాపకు పెట్టాడు. మరో మనవరాలికి వనశ్రీ అని నామకరణం చేశారు. కోటికిపైగా మొక్కలను నాటి ట్రీ మ్యాన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన రామయ్య సేవలకుగాను పలు సంస్థలు అవార్డులతో సత్కరించాయి. 2005లో సెంటర్‌ఫర్ విూడియా సర్వీసెస్ సంస్థ నుంచి మనమిత్ర అవార్డులో ఇచ్చింది. యూనివర్సల్ గ్లోబల్ పీస్ అనే అంతర్జాతీయ సంస్థ ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసింది. 1995లో భారత ప్రభుత్వం నుంచి వనసేవా అవార్డు లభించింది.
ప్రకృతి లేనిదే మనుగడ లేదని బలంగా నమ్మిన వ్యక్తి.. : సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్(జనంసాక్షి):వనజీవి రామయ్య మృతికి పలువురు ప్రముఖలు సంతాపం తెలిపారు. ఆయన మరణ వార్త తెలుసుకుని తీవ్ర దిగ్భార్రతికి లోనయ్యారు. ఆయన మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ప్రకృతి లేనిదే మనుగడ లేదని బలంగా నమ్మిన వ్యక్తి ఆయన అని చెప్పారు. వ్యక్తిగా మొక్కలు నాటి సమాజాన్నే ప్రభావితం చేసిన వ్యక్తి రామయ్య అన్నారు. ఆయన మరణం సమాజానికి తీరని లోటు- అని పేర్కొన్నారు. రామయ్య సూచించిన మార్గం నేటి యువతకు ఆదర్శమన్నారు. వనజీవి రామయ్య మరణం పట్ల భారాస అధినేత కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. పచ్చదనం పరిరక్షణ కోసం వనజీవి చేసిన కృషిని స్మరించారు. ఆయన మరణంతో తెలంగాణ ఒక ప్రపంచ పర్యావరణవేత్తను కోల్పోయిందన్నారు. పర్యావరణం కోసం ఆయన చేసిన త్యాగం అసమాన్యమైనదని వివరించారు. హరితహారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆయన అందించిన సహకారం గొప్పదన్నారు. రామయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.రామయ్య మరణ వార్త తెలిసి తీవ్ర విచారానికి లోనైనట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. పచ్చదనం ప్రాధాన్యత చెప్పిన రామయ్య నేటితరానికి ఆదర్శమని చెప్పారు. ఆయన మరణం పర్యావరణ పరిరక్షణ ఉద్యమానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటు-న్నట్లు చెప్పారు. వనజీవి రామయ్య మరణం బాధాకరమని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. వృక్షో రక్షతి రక్షితః అనే సందేశమే ఆయన జీవిత సారాంశమని పేర్కొన్నారు. చెట్ల ఆవశ్యకత చెప్పిన రామయ్యే నిజమైన పర్యావరణ యోధుడని పేర్కొన్నారు. వనజీవి రామయ్య చూపిన మార్గం భావితరాలకు ప్రేరణ అని వివరించారు. పర్యావరణం కోసం జీఇతాంతం తపించిన వ్యక్తి వనజీవి రామయ్య అని ఎపి డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన మరణం వృక్షరక్షణకు పాటుపడుతున్న వారికి తీరని లోటన్నారు. పెద్దగా చదువుకోకున్నా ప్రకృతిని ఆస్వాదించి, పరిరక్షించేందుకు చూపిన మార్గం అనుసరణీయమని అన్నారు. మనమంతా మొక్కలు నాటుతూ ముందుకు సాగడమే ఆయనకు అందించే నివాళి అని పవన్ కళ్యాణ్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.
వనజీవి రామయ్య మృతికి కెసిఆర్, భట్టి, పొంగులేటి సంతాపం
ప్రముఖ సామాజిక కార్యకర్త, పద్మశ్రీ వనజీవి రామయ్య మృతిపట్ల బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రి పొంగులేటి,బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు, పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తంచేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. పర్యావరణ పరిరక్షణే ప్రాణంగా బతికిన పద్మశ్రీ వనజీవి రామయ్య మృతిపట్ల బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ విచారం వ్యక్తం చేస్తూ, సంతాపం ప్రకటించారు. వృక్షో రక్షతి రక్షితః అనే నినాదాన్ని తన శరీరంలో భాగం చేసుకుని, కోటికి పైగా మొక్కలను నాటి, ప్రపంచానికి పచ్చదనం ప్రాముఖ్యతను ప్రచారం చేసిన వనజీవి రామయ్య లక్ష్యం మహోన్నత మైనదని అన్నారు. మొక్కల పెంపకం కోసం వనజీవిగా మారిన దర్పల్లి రామయ్య జీవితం రేపటి తరాలకు ఆదర్శనీయమని కొనియాడారు. ప్రపంచ పర్యావరణం కోసం సాగిన మానవ కృషిలో వనజీవిగా ఆయన చేసిన త్యాగం అసమాన్యమైనదని కేసీఆర్ అన్నారు. అడవులు, పచ్చదనం అభివృద్ధి దిశగా నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన.. తెలంగాణకు హరితహారం ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దర్పల్లి రామయ్య అందించిన సహకారం గొప్పదని గుర్తు చేసుకున్నారు. భవిష్యత్తు తరాలకు మనం అందించే సంపద హరిత సంపదే కావాలని, భౌతిక ఆస్తులు కావని పునరుద్ఘాటించారు. పచ్చని అడవులను ధ్వంసం చేస్తూ, వన్యప్రాణులకు నిలువనీడ లేకుండా ప్రభుత్వాలు ప్రదర్శిస్తున్న పర్యావరణ వ్యతిరేక ధోరణులను నిలువరించడానికి, వర్తమాన పరిస్థితుల్లో వేలాది వనజీవి రామయ్యల అవసరం ఉన్నదని స్పష్టం చేశారు. వనజీవి మరణంతో తెలంగాణ ఒక ప్రపంచ పర్యావరణ వేత్తను కోల్పోయిందని విచారం వ్యక్తం చేసారు. శోకంలో మునిగిన వారి కుటుంబ సభ్యులకు అభిమానులకు పర్యావరణ పరిరక్షకులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వనజీవి రామయ్య మృతి రాష్టాన్రికి, దేశానికి తీరని లోటని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఆయన జీవితం భవిష్యత్ తరాలకు స్ఫూర్తి అని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. రామయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కోటి మొక్కల ప్రధాత మృతి ప్రకృతి ప్రేమికులకు తీరని లోటని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వనజీవి రామయ్య ఖమ్మం జిల్లా ఖ్యాతిని ఖండాంతరాలకు చాటి చెప్పారని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. వనజీవి మృతిపట్ల కేంద్ర మంత్రి బండి సంజయ్, బీఆర్‌ఎస్ వద్దిరాజు రవిచంద్రం సంతాపం వ్యక్తంచేశారు. పద్మశ్రీ వనజీవి రామయ్యను కోల్పోవడం చాలా బాధాకరమని మాజీ ఎంపీ సంతోష్ కుమార్ అన్నారు. చెట్ల పెంపకం, పర్యావరణ పరిరక్షణకు తన జీవితాన్ని అంకితం చేసిన నిజమైన ప్రకృతి యోధుడని చెప్పారు. రామయ్య కుటు-ంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వనజీవి మృతిపట్ల సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు సంతాపం తెలిపారు. ప్రకృతి ప్రేమికుడు, హరిత స్వాప్నికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి దరిపెల్లి రామయ్య మృతి తీరని లోటన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వృక్షో రక్షతి రక్షితః అన్న సిద్ధాంతాన్ని త్రికరణశుద్ధిగా ఆచరించి, మొక్కలను బిడ్డలవలే పెంచారు. ఇంటిపేరునే వనజీవిగా మార్చుకొని కోట్లాది మొక్కలకు ప్రాణం పోశారు. పర్యావరణ హితమే తన ఊపిరిగా భావించిన ఆయన, ఆరోగ్యం సహకరించకున్నా మొక్కలు నాటే ఉద్యమాన్ని మాత్రం ఆపలేదు. వారి జీవితం భవిష్యత్ తరాలకు స్ఫూర్తి. అలాంటి గొప్ప వ్యక్తి వనజీవి రామయ్య నేడు మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు.
మొక్కల కోసమే తన జీవితం అంకితం: ప్రధాని దిగ్భ్రాంతి
న్యూఢల్లీి(జనంసాక్షి):పద్మశ్రీ పురస్కార గ్రహీత వనజీవి రామయ్య మృతిపై ప్రధాని మోదీ దిగ్భార్రతి వ్యక్తం చేశారు. సుస్థిరత కోసం గళం వినిపించిన వ్యక్తిగా రామయ్య గుర్తుండిపోతారని అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా తెలుగులో పోస్టు చేశారు. లక్షలాది మొక్కలు నాటడానికి, వాటిని రక్షించడానికి రామయ్య తన జీవితాన్ని అంకితమిచ్చారు. ఆయన అవిశ్రాంత కృషి.. ప్రకృతి పట్ల గాఢమైన ప్రేమనూ, భవిష్యత్ తరాలపట్ల బాధ్యతను ప్రతిబింబిస్తాయి. ఆయన చేసిన కృషి.. యువతలో మరింత సుస్థిరమైన హరిత గ్రహాన్ని నిర్మించాలనే తపనను ప్రేరేపిస్తూనే ఉంటుంది. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి‘ అంటూ రాసుకొచ్చారు.