పనిచేస్తున్న అధికారుల హెచ్చరికలు

 

వ్యక్తిగత మరుగదొడ్ల నిర్మాణంలో పురోగతి

జనగామ,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): స్వచ్ఛ జనగామ జిల్లాగా మార్చేందుకు ప్రతి ఇంట్లో మరుగు దొడ్డి నిర్మించుకోవాలని డీపీవో అన్నారు. గ్రామాల్లో చేపడుతున్న మరుగుదొడ్ల నిర్మాణాలను పంచాయితీ అధికారులు పరిశీలించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు గ్రామాల వారీగా ప్రజాప్రతినిధులు, అధికారులకు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పనుల బాధత్యతలు అప్పగించినట్లు తెలిపారు. గ్రామాల వారీగా అధికారులు, సిబ్బంది ప్రత్యేక సమావేశాలు నిర్వహించడంతో పాటు లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మరుగుదొడ్డి లేని ఇంటికి రేషన్‌ సరుకుల సరఫరాను నిలిపివేయనున్నట్లు గతంలో చేసిన హెచ్చరికలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. మరుగుదొడ్డి లేని ఇంటికి రేషన్‌ నిలిపివేసేలా చూడాలని, అలాగే మరుగుదొడ్డి లేని రేషన్‌ షాపుల అనుమతిని తొలగించనున్నామని తెలిపారు. రేషన్‌ డీలర్లు గ్రామానికి ఆదర్శంగా నిలవాలని, వ్యక్తిగత మరుగుదొడ్లు లేని వారిని ఇప్పటికైనా గుర్తించి మంజూరీ ఇప్పించి వెంటనే నిర్మించడానికి సహకారాలను కోరారు. నవంబర్‌ 30 నాటికి మరుగుదొడ్లను నిర్మించు కోకుంటే రేషన్‌ సరుకులతో పాటు పెన్షన్‌, షాదీముభారక్‌, ఆరోగ్యశ్రీ వంటి పథకాలను నిలిపివేస్తామని అన్నారు. అన్ని గ్రామాలకు మరుగుదొడ్లను నిర్మించాలనే టార్గెట్‌ పెట్టుకున్నారు. ఇప్పటి వరకు అనేక గ్రామాల్లో నిర్మాణాలు వివిధ దశలో ఉన్నట్లు తెలిపారు. జనగామను బహిర్గత మలమూత్ర విసర్జన రహిత జిల్లాగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో జిల్లా అధికారులు పనిచేస్తున్నారని, దీనికి ప్రతీఒక్కరు తోడ్పాటును అందించాలని కోరారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.12వేలను అందించడం జరుగుతుందన్నారు. నవంబర్‌ 30నాటికి ప్రతీఇంటికి మరుగుదొడ్డి ఉండాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రభుత్వంనుంచి వచ్చే సంక్షేమ పథకాలు గ్రామానికి నిలిపివేస్తామని పేర్కొన్నారు.