పన్ను ఎగ్గొట్టింది వీరే..

ఢిల్లీ : పన్ను ఎగవేత దారులపై ఆదాయపు పన్ను శాఖ గతంలో ఎన్నడూ లేని విధంగా కఠిన నిర్ణయం తీసుకుంది. 10 కోట్లకు పైగా బకాయి పడ్డ సంస్థల పేర్లు ప్రజలందరికీ తెలిసేలా పేపర్లలో ప్రకటనలిచ్చింది. ఆదాయపు పన్ను శాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో బకాయిలు వస్తాయో రావో తెలియదు కానీ..పరువు మాత్రం పోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆదాయపు పన్నుచెల్లించని సంపన్నులపై ప్రభుత్వం వ్యహాత్మకంగా వ్యవహరిస్తోంది. ట్యాక్స్ లు చెల్లించని సంస్థలు, యజమానుల పేర్లను ప్రపంచానికి తెలియజేసి పరువు పోయేలా చేస్తోంది. నేమింగ్‌ అండ్‌ షేమింగ్‌ పేరుతో పన్ను ఎగవేతదారుల పేర్లను పేపర్ల కెక్కిస్తోంది. 500 కోట్లు వరకు బకాయిలున్న 18 సంస్థల పేర్లు, వాటి పాన్‌ నెంబర్లు, ఫోన్‌ నెంబర్లు..అడ్రస్‌లను పేపర్లలో ప్రకటిస్తోంది. దేశ రాజధానిలోని ఆదాయపు పన్ను శాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌ కార్యాలయం నుంచి ఈ ప్రకటన విడుదలైంది.
ఒత్తిడి తేవాలనే…
పన్ను ఎగవేతదారుల గురించి సామాన్య ప్రజలందరికీ తెలియజేయడమే కాకుండా.. పన్ను చెల్లించేలా వారిపై ఒత్తిడి తీసుకురావడమే తమ ఉద్దేశమని ఆదాయ పన్ను శాఖ అధికారులు భావిస్తున్నారు. ఆదాయపు పన్ను శాఖ ప్రకటించిన ఉద్దేశపూర్వక పన్ను ఎగవేత దారుల్లో గోల్డ్ సుఖ్‌ ట్రేడ్‌..సొమానీ సిమెంట్స్ వంటి ప్రముఖ కంపెనీలున్నాయి. ఆదాయపు పన్ను శాఖ ప్రకటించిన 18 సంస్థల్లో ఒక్కో సంస్థకు 10 కోట్లకు పైగానే బకాయిలున్నాయి.
18 మంది ఎగవేతదారులు..
ఆదాయపు పన్ను శాఖ మొత్తం 18 మంది ఎగవేతదారులను ప్రకటించగా..వాటిలో 11 గుజరాత్‌కు చెందినవే ఉన్నాయి. సొమానీ సిమెంట్స్ 27 కోట్ల 47 లక్షలు, బ్లూ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ 75 కోట్ల 11 లక్షలు, ఆపిల్‌ టెక్‌ సొల్యూషన్స్ 27 కోట్ల 7 లక్షలు, జ్యూపిటర్‌ బిజినెస్‌ 21 కోట్ల 31 లక్షలు, హిరాక్‌ బయోటెక్‌ 18 కోట్ల 54 లక్షలు, ఐకాన్‌ బయో ఫార్మా అండ్‌ హెల్త్ కేర్‌ 17 కోట్ల 69 లక్షలు, బనియన్‌ అండ్‌ బెర్రీ అలాయిస్‌ 17 కోట్ల 48 లక్షలు, లక్ష్మీనారాయణ్‌ టి. టక్కర్‌ 12 కోట్ల 49 లక్షలు, విరాగ్‌ డైయింగ్‌ అండ్‌ ప్రింటింగ్‌ 18 కోట్ల 57 లక్షలు, పూనమ్‌ ఇండస్ట్రీస్‌ 15 కోట్ల 84 లక్షలు, కున్వర్‌ అజయ్‌ పుడ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 15 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. జైపూర్‌కు చెందిన గోల్డ్ సుఖ్‌ ట్రేడ్‌ ఇండియా 75 కోట్ల 47 లక్షలు, కోల్‌కతాకు చెందిన విక్టర్‌ క్రెడిట్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్స్ 13 కోట్ల 81 లక్షలు, ముంబైకి చెందిన నోబుల్‌ మర్కండైజ్‌ 11 కోట్ల 93 లక్షలు బాకీ పడ్డాయి.
కొనసాగుతుంది..
ఎన్నిసార్లు నోటీసులిచ్చినా..బతిమాలినా వినిపించుకోకపోవడంతో చివరకు ఈ రకంగా చేయాల్సి వస్తుందని ఆదాయపు పన్ను శాఖాధికారులన్నారు. ఆర్ధిక సంవత్సరం చివరి రోజు నాడు మొదలైన నేమింగ్‌ అండ్‌ షేమింగ్‌ కార్యక్రమం తరచుగా కొనసాగుతుందని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది.