“పరువు బజారుకెక్కుతుందని తెరాస గుండాలు దాడులకు పాల్పడుతున్నారు – బిజెపి”
శేరిలింగంపల్లి, ఆగస్టు 23( జనంసాక్షి): భారతదేశంలోని ఏ రాష్ట్రంలో లేనంత నీచమైన రాక్షస పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుందని, గులాబీదండు చేస్తున్న అరాచకాలను ప్రశ్నిస్తున్న భారతీయ జనతాపార్టీవల్ల పరువు బజారులోపడుతుందని భావించి బిజెపి నాయకులు, కార్యకర్తలపై తెరాస గుండాలు దాడులకు పాల్పడుతున్నారని రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి ప్రధానకార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్, రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ మేరకు బిజెపి రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షులు సామ రంగారెడ్డి పై తెరాస గుండాలు వీధి రౌడీల కంటే అధ్వానంగా విచక్షణ కోల్పోయి దాడులకు పాడుపడ్డారని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని ఆగ్రహం వ్యక్తంచేశారు. దాడులకు పాల్పడిన గుండాలపై సిగ్గులేని తెరాస ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దురదృష్టకరమన్నారు. బిజెపి తలచుకుంటే టిఆర్ఎస్ గుండాల దమ్ము సరిపోతుందా అని వారు ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కెసిఆర్ కూతురు కల్వకుంట్ల కవిత హస్తం ఉందని తెలియడంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆమె ఇంటివద్ద శాంతియుత విధానంలో నిరసనకు దిగడాన్ని జీర్ణించుకోలేని సిగ్గులేని టీ.అర్.ఎస్ గుండాలు రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షులు సామ రంగారెడ్డి గారిపై దాడిచేసి విచక్షణ రహితంగా కొట్టడం జరిగిందన్నారు. టీ.అర్.ఎస్ దొంగల దాడికి నిరసనగా మియాపూర్ సిగ్నల్ (సంక్రాంతి హోటల్) వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించి కల్వకుంట్ల కవిత దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగిందన్నారు. కెసిఆర్ కుటుంబం కబ్జాలకు, లుటీలకు, దోపిడీలకు, స్కాంలకు పెట్టింది పేరని, తప్పుచేసిన కవితని వదిలేసి శాంతియుతంగా దీక్షచేస్తున్న రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ని, నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేయడం గులాబీ నేతల దిగజారుడుతనానికి నిదర్శనం కాదా అని వారు దుయ్యబట్టారు. అక్రమాలను అడిగిన సామ రంగారెడ్డిపై టీ.అర్.ఎస్ గుండాలు దాడిచేసి కొట్టడం కెసిఆర్ రజాకార్ బుద్ధికి నిదర్శనమని, దీనిని తాము తీవ్రంగాఖండిస్తున్నామన్నారు. ఇలాగే దాడులకు పాల్పడితే ప్రతి దాడులు తప్పవని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చేసిన ముట్టడులు అధికారం లోకి రాగానే మరిచారా అని, మీరు చేస్తే ఉద్యమం బీజేపీ వాళ్ళు చేస్తే హత్యయత్నమా అని ఎద్దేవా చేశారు. బాధితులపైన కేసులు పెట్టడం సిగ్గుమాలిన చర్య అని, ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా… బీజేపీ కార్యకర్తల పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎటువంటి షరతులు లేకుండా ఎత్తివేయాలని లేదంటే రాబోయే తీవ్ర పరిణామాలను ఎదుర్కొనడానికి సిద్దంగా ఉండాలని గోవర్ధన్ గౌడ్, రవి కుమార్ యాదవ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బుచ్చి రెడ్డి, డీ యస్ ఆర్ కే ప్రసాద్ బొబ్బ నవత రెడ్డి, సుర్ణ శ్రీశైలం, మనిక్ రావు, శ్రీధర్ రావు, రాజు శెట్టి కురుమ, ఆంజనేయులు, జీ. రాంరెడ్డి, నర్సింగ్ రావు, శాంతి భూషణ్ రెడ్డి, సైఫుల్ల ఖాన్, కే. జితేందర్, లక్ష్మణ్ ముదిరాజ్, నరేష్ ముదిరాజ్, రత్న కుమార్, రవి గౌడ్, విజేందర్ సింగ్ అన్ని డివిజన్ ల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు