పర్యాటక హబ్‌గా గిరిజన ప్రాంతాలు
– మహిళా సంఘాల సభ్యులు కలిసికట్టుగా వ్యాపారం చేసుకొని ఆదాయం పొందాలి
– ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
– గీతంపేట మన్యంలో గవర్నర్ నరసింహన్ పర్యటన
శ్రీకాకుళం, జులై10(జనం సాక్షి) : గిరిజన ప్రాంతంలోని మహిళా సంఘాల సభ్యులు బ్యాంకుల నుంచి రుణం తీసుకొని కలిసి కట్టుగా వ్యాపారం చేసుకొని ఆదాయం పొందాలని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా సీతంపేట మన్యంలో గవర్నర్ మంగళవారం పర్యటించారు. సీతంపేట మండలం హద్దుబంగి ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులతో ముఖాముఖి జరిపారు. అనంతరం ఐటీడీఏ కార్యాలయంలో గిరిజన యువత, గిరిజన నాయకులతో సమావేశమయ్యారు. పెదరామ గ్రామంలో మహిళా సంఘ సభ్యులు, రైతులతో ముఖాముఖి నిర్వహించారు. చివరగా సీతంపేట సామాజిక ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాలను అంతా వినియోగించుకోవాలన్నారు. గ్రామాల్లో రహదారులు, తాగునీరు, వైద్యం తదితర సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోందని పేర్కొన్నారు. పిల్లల్ని పాఠశాలలకు పంపించాలని చదువులు మధ్యలో మాన్పించరాదని సూచించారు. గిరిజనులంతా కలిసికట్టుగా ముందుకు సాగాలని పేర్కొన్నారు. పర్యాటక హబ్‌గా అభివృద్ధి చెందితే గిరిజన ప్రాంతాలకు మరింత ప్రాధాన్యం లభిస్తుందని గవర్నర్ అన్నారు. డబ్బు సంపాదనే ముఖ్యం కాదని, సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్రనుసైతం తెలుసుకోవాలన్నారు. గవర్నర్‌తో పాటు కలెక్టర్ ధనుంజయరెడ్డి, ఐటీడీఏ పీవో శివశంకర్, గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి హరిప్రీత్ సింగ్, ఎమ్మెల్యే కళావతి తదితరులు పాల్గొన్నారు.