పర్యావరణ పరిరక్షణలో ముందున్నాం: జోగురామన్న

న్యూఢిల్లీ,జూన్‌4(జ‌నం సాక్షి ): పర్యావరణ పరిరక్షణ చర్యల్లో తెలంగాణ ముందున్నదని అటవీ పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. ప్లాస్టిక్‌ నిషేధం సహా అనేక చర్యలు తీసుకున్నామని అన్నారు.జూన్‌ 5న పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర పర్యావరణ, అటవీశాఖ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై నాలుగు రోజుల పాటు సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ సమావేశాలకు రాష్ట్రం తరపున అటవీశాఖ మంత్రి జోగు రామన్న, అజయ్‌ మిశ్రా, అశోక్‌ కుమార్‌ హాజరయ్యారు. పర్యావరణ పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలను మంత్రి జోగు రామన్న వివరించారు. తెలంగాణలో కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని 23 నుంచి 33 శాతానికి పెంచడమే లక్ష్యమని ఉద్ఘాటించారు. కాలుష్యకారక పరిశ్రమలపై చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అధిక వ్యర్థాలు విడుదల చేస్తున్న పరిశ్రమలను మూసివేస్తున్నామని పేర్కొన్నారు. ప్లాస్టిక్‌ నిషేధానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. 2022 నాటికి ప్లాస్టిక్‌ పూర్తి నిషేధించాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. పెరుగుతున్న కాలుష్యంతో పర్యావరణం దెబ్బతింటుందని చెప్పారు. పెరుగుతున్న కాలుష్యంతో మానవ మనుగడకే ముప్పు వాటిల్లుతుందని మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు.