పర్యావరణ హితాన్నిమరుస్తున్న ప్రభుత్వాలు

కాలుష్య కేంద్రాలు అవుతున్న పచ్చటి పంటపొలాలు

మేల్కోకపోతే తుత్తుకూడి ఘటనలు పునరావృతం కాగలవు

చెన్నై,మే25(జ‌నంసాక్షి): పర్యావరణ పరిరక్షణకు ప్యారిస్‌ ఒప్పందాలంటూ పెద్దపెద్ద మాటలు చెబుతున్న ప్రభుత్వాలు దేశంలో పర్యావరణ హితం కోరే చర్యలు మాత్రం తీసువడం లేదు. ఇబ్బడి ముబ్బడిగా పరిశ్రమలకు అనుమతి ఇవ్వడం వల్ల దేశంలో పర్యావరణ ప్రతికూల ప్రభావం పెరుగుతోంది. రుతుపనవాలు గతితప్పాయి. సకాలంలో వర్షాలు పడడం లేదు. ఎరువుల వినయోగం పెరగడంతో భూమి నిస్సత్తువగా మారింది. పంటపొలాలను పరిశ్రమల కేంద్రాలుగా మారుస్తున్నారు. ప్రజలు వ్యతిరేకిస్తున్నా పట్టించుకోవడం లేదు. తాజాగా తమిళనాడు మారణకాండ దీనికి నిదర్శనంగా చూడాలి. పర్యావరణానికి సంబంధించిన చట్ట నిబంధనలను గాలికొదిలేయటంలో వేదాంత గ్రూప్‌కు మోడీ సర్కారు సాయపడిన విషయం క్రమంగా వెలుగులోకి వస్తోంది. తమిళనాడులోని తూత్తుకుడిలో 1,200 టన్నుల రాగిశుద్ధి కర్మాగారాన్ని విస్తరించటం వివాదాస్పదంగా మారి ఈ నెల 23న 12 మంది ప్రాణాలను బలితీసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్లాంట్‌

నిర్మాణానికి ముందు ప్రజలతో సంప్రదించాలని కోర్టు ఆదేశించినప్పటికీ, తాము చట్ట ప్రకారం అలా చేయాల్సిన అవసరం లేదంటూ వేదాంత గ్రూప్‌ కోర్టును తప్పుదోవ పట్టించింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖతో పాటు కోర్టులకు సంబంధిం చిన పలు రికార్డులను పరిశీలించిన విూడియా ప్రతినిధులకు ఎన్డీయే ప్రభుత్వం 2014 డిసెంబర్‌లో పర్యావరణ చట్ట నిబంధనలను అడ్డగోలుగా సవరించి వేదాంత గ్రూప్‌ తన తూత్తుకుడి ప్లాంట్‌ విస్తరణకు ప్రజలను ముందుగా సంప్రదించాల్సిన అవసరం లేకుండా మినహాయింపుల నిచ్చినట్లు సృష్టమైంది. ఇటువంటి మినహాయింపుల కోసం కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖకు ఇప్పటికే అనేక పారిశ్రామిక సంస్థలు వినతులు సమర్పించినట్లు ప్రభుత్వ, కోర్టు రికార్డుల ద్వారా తెలుస్తోంది. గత యుపిఎ ప్రభుత్వ హయాంలోని పర్యావరణ మంత్రిత్వశాఖ వేదాంత తన తూత్తుకుడి ప్లాంట్‌ విస్తరణకు ముందుగా చట్ట ప్రకారం ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఎన్డీయే సర్కారు వేదాంత గ్రూప్‌కు అనుకూలంగా జారీ చేసిన ఈ సవరణలను 2016లో జాతీయ హరిత ట్రిబ్యునల్‌ చట్టవిరుద్ధమంటూ కొట్టిపారేసింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని వక్రీకరిస్తే అరెస్ట్‌ వారెంట్లు జారీ చేస్తామని పర్యావరణ మంత్రిత్వశాఖ అధికారులను ట్రిబ్యునల్‌ హెచ్చరించింది. కానీ అధికారులు మాత్రం 2014 డిసెంబర్‌ నాటి ప్రభుత్వ ఆదేశాలను రద్దు చేస్తే అనేక ప్రాజెక్టులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందంటూ ట్రిబ్యునల్‌ ముందు తమ వాదనను వినిపించారు. చివరికి 2014 డిసెంబర్‌ నాటి ప్రభుత్వ ఆదేశాలను ఎన్‌జిటి రద్దు చేసింది. తూత్తుకుడిలో తాజాగా జరిగిన హింసాకాండ నేపథ్యంలో ప్రాజెక్టు విస్తరణను నిలిపివేయాలంటూ చెన్నరు హైకోర్టు బుధవారం ఆదేశాలుజారీ చేసిన సమయంలో 2016 నాటి ఎన్‌జిటి ఆదేశాలు, ఇతర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఈ రాగి పరిశ్రమ కాలుష్యం వల్ల తమ ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయంటూ స్థానికులు చాలా ఏళ్లుగా తీవ్రస్థాయిలో ఉద్యమం చేస్తున్నారు. అయితే తాము పర్యావరణ అనుమతులు తీసుకున్నాకే.. విస్తరణ పనులు చేపడుతున్నామని వేదాంత చెబుతోంది. ప్రజాభిప్రాయ సేకరణ చేయాల్సిందేనంటూ 2014 మేలో ప్రభుత్వం తెగేసి చెప్పింది. 2014 డిసెంబరులో ఆ ఉత్తర్వులకు చెల్లుచీటీ పలకడంతో.. 2018 డిసెంబరు వరకు పర్యావరణ అనుమతుల్ని పొడిగిస్తూ 2015 మార్చిలో పర్యావరణ శాఖ ఆదేశాలు ఇచ్చింది. ఫలితంగా నిర్మాణాల్ని కొనసాగించడానికి వేదాంతకు అవకాశం వచ్చింది. ప్రజాభిప్రాయ సేకరణపై వివిధ కోర్టుల్లో కేసులు నడుస్తున్న సమయంలోనే వేదాంతకు అనుమతి రావడం గమనార్హం. ఈ ఒక్క పరిశ్రమ కారణంగా ప్రజలు ఎంతగా ఆందోళన చెందుతున్నారో దేశంలోని అనేక పరిశ్రమలకు ఇఇ వర్తిస్తుంది. పర్యావరణకు పెద్దపీట వేస్తూ నిర్ణయాలు ఉండాలి. దేశహితం మరిస్తే ముప్పు పొచి వుంటుంది.