పలకరించిన తొలకరి

కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాలు
జూన్‌ మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశం
న్యూఢిల్లీ,మే29(జ‌నం సాక్షి): చల్లని కబురు అందింది. వరుణ సందేశం తీసుకుని వచ్చింది.  నైరుతీ రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. ఈ ఏడాది మూడు రోజులు ముందగానే రుతుపవనాలు కేరళలో ప్రవేశించినట్లు భారతీయ వాతావరణశాఖ వెల్లడించింది. దీంతో నాలుగు నెలల వర్షాల సీజన్‌ ప్రారంభమైందని ఐఎండీ పేర్కొన్నది. సాధారణంగా ప్రతి ఏడాది జూన్‌ ఒకటవ తేదీన నైరుతీ రుతపవనాలు కేరళలో ప్రవేశిస్తాయి. మరో నెలన్నర రోజుల వ్యవధిలో దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయి. ఈ ఏడాది సాధారణ స్థాయిలోనే వర్షపాతం ఉంటుందని ఐఎండీ వెల్లడించింది. వాతావరణాన్ని అంచనా వేసే స్కైమెట్‌ అనే ప్రైవేటు సంస్థ నైరుతీ రుతుపవనాలు సోమవారమే ప్రవేశించినట్లు పేర్కొన్నది. ఒకవేళ మే 10వ తేదీ తర్వాత కేరళలోని 14 ప్రాంతాల్లో వరుసగా రెండు రోజుల పాటు 60 శాతం కన్న ఎక్కువ వర్షం నమోదు అయితే, ఆ లెక్క ప్రకారం దేశంలోకి నైరుతీ రుతుపవనాలు ప్రవేశించినట్లు ఐఎండీ వెల్లడించింది. మినికోయ్‌, అమిని, తిరువనంతపురం, పునలూర్‌, కొల్లామ్‌, అలప్పుజా, కొట్టాయం, కోచి, త్రిసుర్‌, కోజికోడ్‌, తలసరీ, కన్నూరు, కుడులు, మంగలూర్‌ ప్రాంతాల్లో గత రెండు రోజులుగా 2.5ఎంఎం వర్షం నమోదు అయ్యింది. రుతుపవనాలు ప్రవేశించినట్లు ప్రకటించేందుకు దీన్నే కొలమానంగా భావిస్తారు. అంతేకాకుండా పశ్చిమ దిశ నుంచి వీస్తున్న గాలులు సముద్రం మట్టం కంటే సుమారు 15వేల ఫీట్ల ఎత్తులో ఉండాలి. దీన్ని బట్టి కూడా రుతుపవనాల ఆగమనాన్ని అంచనా వేస్తారు. వీటి ఆధారంగా దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే అండమాన్‌ దీవుల్ని దాటాయని బులిటెన్‌ను విడుదల చేసింది భారత వాతావరణ శాఖ. అంచనాలకు భిన్నంగా ఈసారి కాస్తా ముందుగానే అండమాన్‌ను రుతుపవనాలు తాకాయి. మే 29 నాటికి రుతుపవనాలు రావడం గడచిన ఐదేండ్లలో ఇదే తొలిసారి.. రుతుపవనాల రాకతో అన్నదాతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మరో రెండు రోజుల్లో కేరళ, తమిళనాడు రాష్టాల్లోన్రి కొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు సానుకూల వాతావరణం ఏర్పడిందని ఐఎండీ అధికారులు తెలిపారు. దేశంలోకి రుతుపవనాల రాకకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.ఇవే పరిస్థితులు కొనసాగితే తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు  జూన్‌ 7,8వ తేదీల్లో రుతుపవనాలు విస్తరించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది దేశంలో సగటు లేదా అంతకు మించి వర్షాలు కురిసేందుకు 54 శాతం అవకాశం ఉందని ప్రకటించింది. గతేడాది తెలంగాణ, ఏపీని జూన్‌ రెండో వారంలో రుతుపవనాలు పలకరించాయి. ఈ సారి మాత్రం జూన్‌ 8 నాటికి వర్షాలు ప్రారంభమయ్యేలా కనిపిస్తున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి కదలికల్లో మార్పుల్ని బట్టి ఒక రోజు అటుఇటూ కావొచ్చని తెలిపారు. బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రం దక్షిణ ప్రాంతం వరకు విస్తరించిన రుతుపవనాలు, కేరళ తీరాన్ని తాకుతాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం విదర్భ నుంచి తెలంగాణ విూదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఉందని .. దీని ప్రభావంతో కొన్ని చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది.