పలుచోట్ల ఇవిఎంల మొరాయింపు

ఓటర్ల తీవ్ర అసహనం
న్యూఢిల్లీ,మే28(జ‌నం సాక్షి ): పలు రాష్ట్రాల్లో జరుగుతున్న ఉప ఎన్నికల సందర్భంగా అనేక చోట్ల ఇవిఎంలు మొరాయించాయి. దీంతో ఓటర్లు తీవ్రంగా మండిపడ్డారు.  మహారాష్ట్రలోని భండారా-గోండియాలో జరుగుతున్న లోకసభ ఉపఎన్నికలో పెద్ద సంఖ్యలో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో అధికారులు మొత్తం 35 బూత్‌లలో పోలింగ్‌ నిలిపివేశారు. కాగా గోసిఖుర్ద్‌ సాగునీటి ప్రాజెక్టు విషయంలో తాము చేసిన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చనందుకు నిరసనగా 35 గ్రామాల ప్రజలు ఓటింగ్‌ బహిష్కరించారు. దాదాపు 50 వేల మంది ఓటర్లు ఓటింగ్‌కు దూరంగా ఉన్నట్టు సమాచారం. మరోవైపు ఉత్తర ప్రదేశ్‌లోని కైరానా లోక్‌సభ నియోజక వర్గంలో ఈవీఎంలలో భారీ ఎత్తున అవకతవకలు చోటుచేసుకున్నాయంటూ ఆర్‌ఎల్డీ అభ్యర్థి తబస్సుం హాసన్‌ ఈసీకి ఫిర్యాదు చేశారు. కైరానాలో 150 ఈవీఎంలు, నూర్‌పూర్‌లో 84 ఈవీఎం, వీవీపీఏటీ మెషీన్లలో లోపాలున్నట్టు ఆరెల్డీ చెబుతుండగా… ఎస్పీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ ట్విటర్లో స్పందిస్తూ.. నిజంగా ఈవీఎంలలో సాంకేతిక లోపాలున్నాయా లేక కావాలనే ఎన్నికలను చెడగొడు తున్నారా? అదే జరిగితే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినట్టే.. అని వ్యాఖ్యానించారు. అయితే తీవ్రమైన ఎండవేడిమి కారణంగానే ఈవీఎంలు మొరాయిస్తున్నాయని అధికారులు వెల్లడించారు. నాలుగు లోక్‌సభ, 10 శాసన సభ స్థానాల కోసం మొత్తం 10 రాష్టాల్లో ఇవాళ ఉపఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.