పవన్‌.. విద్వేషపూరిత వ్యాఖ్యలు మానుకో

– అలాంటి వ్యాఖ్యలు చాలా ప్రమాదకరం
– విూపార్టీ ఎజెండా ఏమిటో ముందుకు ప్రజలకు చెప్పు
– మతాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించొద్దు
– పవన్‌ను హెచ్చరించిన మంత్రి కళా వెంకట్రావ్‌
విజయనగరం, జూలై9(జ‌నం సాక్షి) : రాజకీయం తెలియనటువంటి వాళ్లు ప్రాంతాలు, మతాలను రెచ్చగొట్టడం చేస్తున్నారని, వాళ్లలో విష బీజాలు నాటేలా వ్యాఖ్యలు చేస్తున్నారని.. అది చాలా ప్రమాదకరమని టీడీపీ ఏపీ అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి కళా వెంకట్రావ్‌ మండిపడ్డారు. సోమవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. ‘పవన్‌ కల్యాణ్‌ రాజకీయంగా ఇంకా పరిపక్వత చెందలేదన్నారు. వీటి కారణంగా రాబోయే తరాలు ఎంత బాధపడతారో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాజకీయ పార్టీలంటే ప్రాంతాలు, మతాలు, వర్గాలను రెచ్చగొట్టేవి కాదని తెలుసుకోవాలని కోరారు. ఉత్తరాంధ్రలో వెనుకబాటు తనం ఉందంటున్నారని, అయితే దానిపై నీ పార్టీ ఏం నిర్ణయాలు తీసుకుందని ప్రశ్నించారు. జనసేన అంటే సింగిల్‌ మ్యాన్‌ ఆర్మీ కూడా కాదని, కేవలం వన్‌ మ్యాన్‌ షో అనొచ్చు అని అభిప్రాయ
పడ్డారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ సహా మిగతా పెద్దలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పార్టీలు పెట్టి సేవచేస్తామని వచ్చారని అన్నారు. కానీ విద్వేష రాజకీయాలు చేయడం మంచిది కాదని పవన్‌కు కళావెంకట్రావ్‌ సూచించారు. ప్రజలను రెచ్చగొట్టటంతో అందరికీ ప్రమాదమేనని అన్నారు. కాపుల రిజర్వేషన్లపై పవన్‌ మాట్లాడుతున్నారని, పవన్‌.. విూ స్నేహితులు బీజేపీ వాళ్ల దగ్గర ఉన్న రిజర్వేషన్‌ బిల్లును పార్లమెంట్‌ సమావేశాల్లో పాస్‌ చేయించాలని సూచించారు. అయితే ఇలా చేసి ఓ సామాజిక వర్గానికి సాయం చేయడం మానేసి ప్రాంతాలు, కులాలు అంటూ ప్రజలను రెచ్చగొట్టడం తగదన్నారు. జనసేనది అనేది స్వరూపం లేని పార్టీ అని, విూ పార్టీ పాలసీ ఏంటి, స్వరూపం ఏంటో చెప్పడం నాయకుల లక్షణమన్నారు. తెల్లవారితే సీఎం చంద్రబాబు నాయుడిపై, మంత్రి నారా లోకేష్‌పై, అధికార పార్టీ నేతలపై విమర్శలు చేయడం తగదని పవన్‌ కల్యాణ్‌కు కళా వెంకట్రావ్‌ సూచించారు. జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చేసిన పార్టీ నుంచి పుట్టిందే వైసీపీ అని కళా వెంకట్రావ్‌ విమర్శించారు. వీధుల్లో మనుషుల్ని నిల్చోపెట్టి జనం వచ్చారని చెప్పుకునే పార్టీ వైసీపీ అని విమర్చించారు. వైసీపీ, జనసేన పార్టీల నాయకులు బీజేపీ పార్టీ ఆడిస్తున్న తోలు బొమ్మలు అని వెంకట్రావ్‌ తెలిపారు.