పసిడిపై రుణాలు ప్రోత్సహించొద్దు

వృద్ధి రేటు పెంచడమే లక్ష్యం
రుతు పవనాలు, వర్షాలపై ఆశ
ఆర్బీఐ గవర్నర్‌ సుబ్బారావు
హైదరాబాద్‌, జూన్‌ 7 (జనంసాక్షి) :
పసిడిపై రుణాలను ప్రోత్సహించవద్దని ఆర్‌బీఐ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు బ్యాంకర్లను కోరారు. 50 గ్రాములకు మించి బంగారంపై రుణాలు ఇవ్వొద్దని సహకార బ్యాంకులకు సూచించారు. బంగారంపై రుణాలను ప్రోత్సహించడం వల్ల ఏటా దేశం బంగారం దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని, ఫలితంగా రుపాయి మారకం విలువ తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఐపీఈ స్వర్ణోత్సవ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. చమురు, బొగ్గు దిగుమతులు అధికం కావడం వల్లే మూడేళ్లుగా కరెంట్‌ ఖాతా లోటు ఏర్పడుతోందని తెలిపారు. పంటల ఉత్పత్తి సామర్థ్యం పెంచాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. వృద్ధిరేటు, ద్రవ్యోల్బణం రెండూ తమ ముందున్న సవాళ్లని, ఎంత మంది ఏమన్నా ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు 13 సార్లు రెపో రేటు సవరించామన్నారు. వాతావరణం అనుకూలిస్తే 2013-14 సంవత్సరంలో సానుకూల ఫలితాలు ఉంటాయని ఆశిస్తున్నామని చెప్పారు. అందరూ ఎదురు చూస్తున్నట్టుగానే తాము రుతు పవనాలు, వర్షాల కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. సమృద్ధిగా వర్షాలు కురిస్తే వృద్ధి రేటు పెరుగుతుందని, ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.