పాకిస్తాన్‌తో చర్చలకు సిద్ధంగానే ఉన్నాం

– నాలుగేళ్లలో 90 వేల మందిని కాపాడాం
– కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌
న్యూఢిల్లీ, మే28( జ‌నం సాక్షి ) : పాకిస్తాన్‌తో చర్చలు జరిపేందుకు భారత్‌ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని, ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనాలన్నదే కేంద్ర ప్రభుత్వం ఉద్దేశమని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ స్పష్టం చేశారు.  మోదీ ప్రభుత్వానికి నాలుగేళ్లు నిండిన నేపథ్యంలో సోమవారం ఆమె విూడియాతో మాట్లాడారు. విదేశాంగశాఖ గత నాలుగేళ్లలో చేపట్టిన కార్యక్రమాలపై ఆమె వివరించారు. గడిచిన నాలుగేళ్లలో విదేశాల్లో చిక్కుకున్న 90 వేల మంది భారతీయులను కాపాడినట్లు ఆమె తెలిపారు. విదేశాల్లో అనేక పర్యటనలు చేసిన మోదీ.. అనేక మంది భారతీయులను స్థానిక శిక్షల నుంచి రక్షించారన్నారు. విదేశాల్లో ఉంటున్న భారతీయులు ఇప్పుడు ప్రశాంతంగా జీవిస్తున్నారని ఆమె అన్నారు. ఐక్యరాజ్యసమితిలో 192 దేశాలకు సభ్యత్వం ఉందని, అన్ని దేశాలకు వెళ్లాలని మొదట్లోనే నిశ్చయించుకున్నామని, ఇప్పటి వరకు తమ అధికారులు 186 దేశాలకు వెళ్లినట్లు సుష్మా చెప్పారు. పాకిస్థాన్‌తో చర్చలకు సిద్ధంగా లేమని తామెప్పుడూ చెప్పలేదన్నారు. కానీ ఉగ్రవాదం, చర్చలు ఒక్కసారి కుదరవన్నారు. పాక్‌ ఎప్పుడూ చరిత్రను వక్రీకరిస్తుందని, వాళ్లు చట్టాన్ని నమ్మరన్నారు. అన్నింటిని పక్కన పెట్టి శాంతినెలకొనేందుకు పాక్‌ ముందుకొస్తే భారత్‌ తప్పనిసరిగా సహకరిస్తుందన్నారు.