పాక్‌కు ధీటుగా బదులిస్తాం

– భారత్‌ కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉంది
– కవ్వింపు చర్యలకు దిగుతూ.. చర్చలంటే కుదరదు
– రక్షణశాఖ మంత్రి నిర్మల సీతారామన్‌
న్యూఢిల్లీ, జూన్‌5(జనం సాక్షి) : కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే పాకిస్థాన్‌కు ధీటైన బదులిస్తామని రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. రంజాన్‌ నేపథ్యంలో సరిహద్దు వ్యవహారంపై ఆమె మంగళవారం విూడియా సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా పాక్‌తో చర్చల అంశంపై ఆమె స్పందించారు. ఓవైపు సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ.. మరోపక్క చర్చలంటే కుదిరే పని కాదన్నారు. ఉగ్రవాదం – చర్చలు ఒకేసారి కుదరవని, కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటించి శాంతి వాతావరణం నెలకొంటేనే చర్చలు జరుగుతాయన్నారు. అలా కాదని ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ధీటైన జవాబిస్తామని ఆమె స్పష్టం చేశారు. సరిహద్దులను సురక్షితంగా ఉంచటం మా బాధ్యత. భారత్‌ కాల్పుల ఉల్లంఘన ఒప్పందానికి కట్టుబడి ఉందన్నారు. అంతేగానీ కవ్వింపు చర్యలను ఉపేక్షించబోదని ఆమె పేర్కొన్నారు. ఇక రక్షణ రంగంలో భారత్‌ -రష్యా సహకారంపై ఆమె స్పందించారు. ‘రక్షణ రంగంలో భారత్‌ -రష్యా సహకారం, సంబంధాలు చాలా ధృడమైనవని నిర్మల సీతారామ్‌ తెలిపారు. రాఫెల్‌ జెట్స్‌ కొనుగోళ్ళలో ఎటువంటి కుంభకోణం జరగలేదని, ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్షం ఆరోపణలు చేస్తున్నాయని తెలిపారు. యూపీఏ హయాంలో ఆయుధాల కొరత ఉండేదన్నారు. 2013-14 లోరూ. 87 వేల కోట్లకు గాను 79వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. కానీ, ప్రస్తుతం భద్రతా బలగాలకు ఆయుధాల కొరత లేదని, 2017-18లో 86488 కోట్ల కేటాయింపులకు గాను 90460 ఖర్చు చేశామని రక్షణ మంత్రి తెలిపారు. అవసరమైన ఆయుధాలు కొనే అధికారాన్ని సులభతరం చేశాం అని ఆమె వివరించారు. కంటోన్మెంట్ల రోడ్ల గురించి మాట్లాడుతూ.. దేశంలోని 62 కంటోన్మెంట్‌ రోడ్ల మూసివేతపై పలు విజ్ఞప్తులు అందాయని,  టీఆర్‌ఎస్‌(తెలంగాణ) సహా పలు పార్టీల ప్రతినిధులతో చర్చించామన్నారు. మిలటరీ, సివిల్‌ సొసైటీతో సమావేశాలు నిర్వహించామన్నారు. రోడ్ల మూసివేతపై ఎంపీలు చేసిన విజ్ఞప్తిలో అర్ధముందని, ఇప్పటిదాకా 850రోడ్లు మూసివేయబడ్డాయని తెలిపారు. 119రోడ్లు నిబంధనలు పాటించకపోవటంతో మూసేశారని, 80 రోడ్లను మళ్ళీ తెరిపించామని సీతారామన్‌ తెలిపారు. 15రోడ్లను పాక్షికంగా తెరిచామని, 24ఇంకా మూసివేసే ఉన్నాయని నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు.