పాక్‌లో చారిత్రాత్మక ఘట్టం

14 ఏళ్ల తర్వాత కొలువుదీరిన ప్రజాస్వామ్యం
పార్లమెంట్‌ సభ్యుల ప్రమాణం
ఇస్లామాబాద్‌, (జనంసాక్షి) :
పాకిస్థాన్‌లో శనివారం చారిత్రత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. కొత్త పార్లమెంట్‌ కొలువుతీరింది. పాకిస్థాన్‌ 66 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ప్రజాస్వామ్యబద్ధంగా అధికారం బదిలీ కానుంది. కొత్త ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్న నవాజ్‌ షరీఫ్‌ ఇతర పార్లమెంట్‌ సభ్యులతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. నవాజ్‌ షరీఫ్‌ను ఈనెల ఐదున దేశ ప్రధానిగా పీఎంఎల్‌ (ఎన్‌) పార్లమెంట్‌ సభ్యులు ఎన్నుకుంటారు. ఆ తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. రావల్పిండి విమానాశ్రయంలో షరీఫ్‌ శనివారం మీడియాతో మాట్లాడారు. ‘భగవంతుడి దయలో భవిష్యత్తులో మరిన్ని శాంతియుత బదలాయింపులుంటాయి. ప్రజల ఓట్లతోనే ప్రభుత్వాలు రావడం, పోవడం కన్నా మెరుగైన పద్ధతి ఏముంది?’ అని వ్యాఖ్యానించారు. ఎట్టకేలకు పాకిస్థాన్‌ పార్లమెంట్‌ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయడంతో ఆ దేశ ప్రజలు సంబరాలు జరుపుకున్నారు.