పాక్‌ చేరుకున్న సరబ్‌జిత్‌ సింగ్‌ కుటుంబ సభ్యులు

విషమంగానే సింగ్‌ ఆరోగ్యం
లాహోర్‌/ఇస్లామాబాద్‌, (జనంసాక్షి) :
పాకిస్థాన్‌ జైల్లో తోటి ఖైదీల దాడిలో తీవ్రంగా గాయపడిన సరబ్‌జిత్‌సింగ్‌ పరిస్థితి విషమించింది. లాహోర్‌లో జిన్నా ఆసుపత్రిలో భారతీయ ఖైదీ సరబ్‌జిత్‌ సింగ్‌కు వైద్యం అందిస్తున్న డాక్టర్‌లు అతను కోలుకునే అవకాశాలు తక్కువని తెలిపారు. సరబ్‌ పరిస్థితి విషమంగా ఉందని, తలకు తగిలిన గాయాలు తీవ్రస్థాయిలో ఉన్నాయని తెలిపారు. సరబ్‌పై ఇటుకలతో తలపైన, స్పూన్‌లు, నెయ్యిడబ్బాలపై రేకులతో ముఖంమీద దాడి చేశారని చెప్పారు. మరోవైపు ఆదివారం లాహోర్‌ చేరుకున్న సరబ్‌ కుటుంబసభ్యులు      జిన్నా ఆసుపత్రికి వెళ్లి ఐసీయూలో ఉన్న అతనిని గదిబయట నుంచి చూశారు. బయటివారు అతనికి దగ్గరగా వెళ్లడం వల్ల ఐసీయూలో ఇన్‌ఫెక్షన్‌లు వ్యాపిస్తాయని వారిని లోపలకు అనుమతించలేదని వైద్యులు చెప్పారు. సరబ్‌ ముఖం వాచిపోయి ఉందని, అతనిని ఇనుప రాడ్లతో కొట్టారని అతని సోదరి దల్బీర్‌ కౌర్‌ అన్నారు. మెరుగైన చికిత్స కోసం తన భర్తను భారత్‌కు పంపాలని సరబ్‌ భార్య సుఖ్‌ప్రీత్‌ కౌర్‌ పాకిస్థాన్‌ అధికారులను కోరారు. కుటుంబ సభ్యులలో ఒకరిని మాత్రం ఆసుపత్రిలో ఉండనిస్తామని వైద్యులు తెలపారు. సరబ్‌ను చూసిన తరువాత కుటుంబ సభ్యులు హోటల్‌కు వెళ్లిపోయారు. వారు వాఘా సరిహద్దు దాటి ఆదివారం మధ్యాహ్నం లాహోర్‌ చేరుకున్నారు.