పాక్‌ హింసను ప్రేరేపిస్తోంది

3

– అరుణ్‌ జైట్లీ

జమ్మూ ,ఆగస్టు 21(జనంసాక్షి): కశ్మీరులో హింసను పాకిస్థాన్‌ ప్రోత్సహిస్తోందని, భారతదేశ సమగ్రతపై దాడి చేస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాళ్ళదాడులు, హింసాత్మక చర్యలకు పాల్పడేవారిని క్షమించేది లేదని హెచ్చరించారు. జమ్మూ నగరంలో జరిగిన సభలో మాట్లాడుతూ అభివృద్ధి గత 60 ఏళ్ళ నుంచి తిరస్కరణకు గురవుతోందని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని చెప్పారు. కశ్మీరులో పరిస్థితి తీవ్రంగా ఉందని అంగీకరించారు. పోలీసులపైనా, భద్రతా దళాలపైనా రాళ్ళ దాడులకు పాల్పడుతున్నవారు సత్యాగ్రహులు కాదని, దురాక్రమణదారులని ఆరోపించారు. పరిమిత దృష్టిగలవారు ఈ విషయాన్ని గుర్తించలేరన్నారు. ప్రస్తుతం కశ్మీరులో పరిస్థితులకు కారణం పాకిస్థాన్‌ అని దుయ్యబట్టారు. భారతదేశ సమగ్రతపై పాకిస్థాన్‌ కొత్త పద్ధతిలో దాడి చేస్తోందన్నారు. దేశ విభజన జరిగిన 1947 నాటి నుంచి యుద్ధం చేయడం, అల్లర్లు సృష్టించడం వంటివి విఫలమవడంతో ఈ నూతన మార్గాన్ని ఎంచుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.జమ్మూ-కశ్మీరు విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్యంగా మూడు అంశాలపై దృష్టి కేంద్రీకరించారని అరుణ్‌ జైట్లీ చెప్పారు. వాటిలో మొదటిది, దేశ భద్రత, సమగ్రత విషయంలో రాజీపడకపోవడం, హింసను ప్రేరేపించడంలో సంబంధం ఉన్నవారితో రాజీపడకపోవడం అని తెలిపారు. రెండోది, జమ్మూ-కశ్మీరుకు అభివృద్ధి అవసరమని, 60 ఏళ్ళ నుంచి అభివృద్ధి చెందకపోవడానికి కారణం నేషనల్‌ కాన్ఫరెన్స్‌, కాంగ్రెస్‌ ప్రభుత్వాల పరిపాలన, యుద్ధం, హింస అని పేర్కొన్నారు. మూడోది, జమ్మూపై మరింత శ్రద్ధ పెట్టడమని తెలిపారు.