పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య? ఆ పాఠశాలలో నిత్యం దుర్ఘటనలే అలసత్వం ఎవరిదో?

బిచ్కుంద మద్నూర్ అక్టోబర్ 31 (జనంసాక్షి)
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం పెద్ద ఎక్లార గురుకుల పాఠశాలలో నిత్యం దుర్ఘటనలే పునరావృతం అవుతున్నాయి. ప్రభుత్వం నిర్లక్ష్యమా పాఠశాల యాజమాన్యం అలసత్వమా అనేది తెలవడం లేదు. మంగళవారం నాడు ఉదయం బిచ్కుంద మండలానికి చెందిన ఇంటర్ మొదటి సంవత్సరంలో సీఈసీ చదువుతున్న అమ్మాయి అనుమానాస్పదంగా మరణించింది. కాగా విద్యార్థిని ఆత్మహత్య విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు పాఠశాలకు బంధుమిత్రులతో చేరుకొని తీవ్రస్థాయిలో ఆందోళన చేశారు. విద్యార్థిని మృతి పట్ల సరైన ఆధారాలు కనిపించకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహంతో పాఠశాల ప్రిన్సిపాల్ పై దాడికి యత్నించారు. వారిని అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఆందోళన కొనసాగింది. ఒకింత పోలీసులకు విద్యార్థిని తల్లిదండ్రులకు మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో పెట్రోల్ తీసుకొచ్చి పాఠశాల ప్రిన్సిపాల్‌ను బంధించి గదిపై పెట్రోల్ చల్లే ప్రయత్నం చేయగా పోలీసులపై కూడా పెట్రోల్ పడడం‌తో ఘర్షణ ఉధృతంగా మారింది. ఏ క్షణమైనా ఏదైనా జరగొచ్చు అనే పరిస్థితి ఎక్లార గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది. ఏది ఏమైనా నిజానిజాలు తెలుసుకొని, దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంపై జనంసాక్షి డీఎస్పీ కు వివరణ కోరగా పరిస్థితి అదుపులో ఉందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.