పాఠ్యాంశాలుగా తెలంగాణ మహనీయుల జీవిత చరిత్ర
ఈశ్వరీబాయి రాజకీయ ఫైర్ బ్రాండ్
హైదరాబాద్,ఫిబ్రవరి24(జనంసాక్షి): స్వర్గీయ ఈశ్వరీబాయి మెమోరియల్ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ మహనీయుల జీవిత చరిత్రను పాఠ్యాంశాలుగా చేరుస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో ఈశ్వరీబాయి మెమోరియల్ అవార్డు-2015ను రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కృష్ణన్‌కు బహుకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈశ్వరీబాయి గొప్ప రాజకీయ వేత్త అని శ్లాఘించారు. ఆమెకు ఆనాడు ఫైర్ బ్రాండ్ పొలిటికల్ లీడర్‌గా పేరుండేదని గుర్తు చేశారు. ఆమె అసెంబ్లీలో చేసిన ప్రసంగాలు ఆల్ ఇండియా రేడియోలో ప్రసారమైన విషయాన్ని నెమరువేసుకున్నారు. ఈశ్వరీబాయి ప్రజల బాధను తన గొంతుకతో వినిపించేవారని పేర్కొన్నారు. అణగారిన వర్గాలు, మహిళల సమస్యలపై పరిష్కారానికి అలుపెరుగని పోరాటం చేశారని చెప్పారు. ప్రజాభిమానాన్ని పొందిన గొప్ప వ్యక్తి ఈశ్వరీబాయి అన్నారు. ఈశ్వరీబాయి వర్ధంతినే కాదు జయంతిని కూడా తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు. ఆనాడు ఈశ్వరీబాయి పేరు లేకుండా శాసనసభ బులిటిన్ వచ్చేదేకాదని తెలిపారు. 1969 తెలంగాణ ఉద్యమంలో ఈశ్వరీబాయి కీలక పాత్ర పోషించారని అన్నారు. ఈశ్వరీబాయి చేసిన ప్రసంగాలన్నింటినీ తెప్పించి క్రోఢీకరించి సమగ్రంగా అధ్యయనం చేశామని తెలిపారు. చాలా సూటిగా గుండెకు హత్తుకుపోయేలా మాట్లాడటంలో ఈశ్వరీబాయి అగ్రగణ్యురాలని కితాబిచ్చారు. క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నంత మంది పాల్గొనలేదని నిలదీసిన వ్యక్తి అని పొగిడారు. గీతారెడ్డి వంటి మంచి వ్యక్తిని కని సమాజానికి అందించారని సీఎం వ్యాఖ్యానించారు.