పాడిరైతులను ప్రోత్సహించిన ఘనత సిఎందే
ఇప్పుడు ఎకరాకు నాలుగువేలతో వారికి భరోసా: లోక
ఆదిలాబాద్,మే16(జనం సాక్షి): గతంలో ఎన్నడూ లేనివిదంగా పాడిరైతులకు ప్రోత్సాహకం అందించిన ఘనత సిఎం కెసిఆర్‌దని పాడి సమాఖ్య ఛైర్మన్ లోక భూమారెడ్డి అన్నారు. అలాగే ఇప్పుడు ఎకరాకు నాలుగువేల పంట పెట్టబడి ఇస్తున్నామని అన్నారు. మరో 20ఏళ్లు రాష్ట్రంలో సీఎంగా కేసీఆర్ కొనసాగుతారని అన్నారు. రైతులకు పెట్టుబడి భారం కావడంతో ఆదుకోవడం కోసం సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చారన్నారు. ఎకరానికి రూ.నాలుగు వేల చొప్పున వానాకాలం, యాసంగి పంటలకు మొత్తం రూ.ఎనిమిది వేలు అందజేయనున్నామన్నారు. మొదటి విడత వానాకాలం పంటకు రూ.ఆరు వేల కోట్లు, రెండో విడత యాసంగి పంటకు రూ.ఆరు వేల కోట్లు మొత్తం రూ.12 వేల కోట్లు కేటాయించారని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రత్యేక అధికారులను తెలంగాణ రాష్ట్రానికి పంపించి ఇక్కడ అమలవుతున్న పథకాల అమలు తీరును తెలుసుకొని వారి రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారన్నారు. మరో 20 ఏళ్ల పాటు రాష్ట్రంలో సీఎంగా కేసీఆర్ కొనసాగుతారని ఆ కాంక్షించారు. పంట పెట్టుబడి పథకం, ఇతర సంక్షేమ పథకాలతో ప్రజల మనసులను సీఎం కేసీఆర్ దోచుకున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీకి పట్టం కడుతారన్నారు. ఒక పక్క రైతును రాజు చేయడం కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను చేపడుతుంటే మరో పక్క కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు పంటపెట్టుబడి డబ్బుతో రైతులు బీర్లు తాగుతున్నారని అనడం సిగ్గుచేటన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతును అవమానించినట్లేనని ఆరోపించారు. వెంటనే బేషరతుగా కృష్ణసాగర్‌రావు రైతులకు క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇలాంటి నాయకులకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. ప్రధాని నరేంద్రమోడీ సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ నినాదంతో ప్రజలను మోసం చేశారన్నారు. నల్లధనాన్ని తెప్పించి జీరో అకౌంట్ ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారని ఆరోపించారు. ఇప్పటి వరకు ఏ ఒక్క ఖాతాల్లో నయాపైసా కూడా పడలేదన్నారు. బ్యాంకుల్లో దాచుకున్న ప్రజల డబ్బును వారికే ఇవ్వడానికి బ్యాంకర్లు వెనుకడుగు వేస్తున్నారని బ్యాంకులో నగదు కొరత ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. మోస పూరిత మాటలు చెప్పి ప్రజల ఓట్లతో గద్దెనెక్కిన బీజేపీ నాయకులకు టీఆర్‌ఎస్ పార్టీని విమర్శించే హక్కులేదన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్, బీజేపీ నాయకులు తమ పార్టీపై ఆరోపణలు మానుకోక పోతే రాబో యే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
—————