పాతబస్తీలో చిన్నారి అనుమానాస్పద మృతి

హైదరాబాద్‌: హైదరాబాద్‌ పాతబస్తీలోని భవానీనగర్‌లో ఓ ఇంటి ఆవరణలోని బావిలో ఆరునెలల పసిపాప అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. పాప మృతిపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమాచారమందుకున్న పోలీసులు పాపది హత్యకేసుగా నమోదు చేశారు. శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి శవాగారానికి తరలించారు. మహ్మద్‌ ఇస్మాయిల్‌, అలీమా దంపతుల ఏకైక కూతురు ఇంటి ఆవరణలోనే ఉన్న బావిలో శవమై తేలింది. ఆ ఇంటిలో ఇస్మాయిల్‌తో పాటు అతడి సోదరుల కుటుంబాలు కూడా నివాసం ఉంటున్నాయి. నిన్న పాప కనిపించకుండా పోయిన సమయంలో ఇంటిలో మగవారు ఎవరూ లేరని బంధువులు చెబుతున్నారు. తెల్లవారేసరికి పాప బావిలో శవంగా మారి తేలిందని మృతురాలి తండ్రి ఇస్మాయిల్‌ తెలిపారు. కుటుంబసభ్యులంతా పాప అనుమానాస్పదంగా మృతిచెందిందని చెబుతుండగా… పోలీసులు మాత్రం పాపను హత్య చేసి ఉండొచ్చనే అనుమానంతో హత్యకేసుగా నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.