పాతబస్తీ మతసామరస్యానికి ప్రతీక

రాజీవ్‌ సద్భావన దినోత్సవంలో సీఎం
హైదరాబాద్‌, అక్టోబర్‌ 19(జనంసాక్షి):
పాతబస్తీ మతసామరస్యానికి ప్రతీక అని సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నారు..అంతర్జాతీయ సదస్సులకు హైదరాబాద్‌ వేదికగా మారిందని , వచ్చే ఏడాది వ్యవసాయ ప్రపంచ ప్రదర్శన ఇక్కడ నిర్వహించ నున్నట్టు తెలిపారు. దేశం శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లేందుకు రాజీవ్‌గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పాతబస్తీలోని చార్మినార్‌ వద్ద జరిగిన రాజీవ్‌గాంధీ సద్భావనసంస్మరణ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ, సీనియర్‌ నేత కె. కేశవరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పాతబస్తీ మతసామర స్యానికి ప్రతీక అని కొనియాడారు. దేశంలో శాంతి నెలకొన్నప్పుడే అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తామని అన్నారు. తీవ్రవాదాన్ని తుదముట్టించేంతవరకు ప్రతిఒక్కరూ పోరాడాలని రాజీవ్‌గాంధీ ఇచ్చిన పిలుపును ముఖ్యమంత్రి గుర్తుచేశారు. సమాచార రంగంలో, ఇన్ఫర్మేషన్‌ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన ఘనత రాజీవ్‌కు దక్కుతుందని సీఎం అన్నారు. దేశంలో శాంతి నెలకొనేందుకు, భారతీయులందరిలో ఐక్యత తీసుకువచ్చేందుకు రాజీవ్‌ గాంధీ చేపట్టిన సద్భావన యాత్ర మంచిఫలితాలను ఇచ్చిందని ముఖ్యమంత్రి అన్నారు. ముఖ్యంగా పాతబస్తీ అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. దాదాపు వంద ఎకరాలలో పాతబస్తీలోని పేదలకు గృహనిర్మాణాన్ని చేపడతామని ఆయన తెలిపారు. మైనారిటీల అభివృద్ధికి పెద్దపీట వేశామన్నారు. రానున్న మూడేళ్లలో సంపూర్ణ అక్షరాస్యత సాధిస్తామని చెప్పారు. రాజీవ్‌ ఆలోచనల వల్లే భారత దేశం సాంకేతికంగా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. దేశంలో అక్షరాస్యత శాతంలో రాష్ట్రం వెనుకబడిఉందని ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. నిరక్ష రాస్యత వల్ల అభివృద్ధి కుంటుపడుతోందని అన్నారు. పాతబస్తీ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులను కూడా కేటాయిస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరిచేందుకు శక్తివంతంగా పనిచేస్తున్నానని ఆయన తెలిపారు. తాను కూడా హైదరాబాద్‌లోనే పుట్టి, పెరిగానని, ప్రపంచ దేశాలలో హైదరాబాద్‌కు మంచి గుర్తింపు వచ్చే విధంగా కృషి చేస్తానని అన్నారు. ముఖ్యమంత్రి ప్రసంగాన్ని అడ్డుకునేందుకు కొందరు తెలంగాణ జేఏసీ నేతలు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన వారిని పోలీసులు అరెస్టు చేశారు.