పారదర్శకంగా టీచర్ల బదిలీలు చేపడతాం

మంత్రి పార్థసారథి
మార్గదర్శకాలతో కూడిన జీఓ విడుదల
హైదరాబాద్‌, మే 2 (ఎపిఇఎంఎస్‌): ఉపాధ్యాయుల బదిలీల మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది.
ఈ సందర్భంగా గురువారం మంత్రి పార్థ సారథి మీడియాతో మాట్లాడుతూ 8 సంవత్సరాలుగా ఒకే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను తప్పనిసరిగా బదిలీ చేయనున్నట్టు మంత్రి తెలిపారు. జూలై ఒకటి నాటికి 8 సంవత్సరాలుగా పనిచేస్తున్న వారందరినీ బదిలీ చేయనున్నట్టు తెలిపారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేస్తూ సర్దుబాటు ద్వారా బదిలీ అయిన ఉపాధ్యాయులు కూడా కౌన్సెలింగ్‌కు అర్హులని మంత్రి తెలిపారు. బాలికోన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న 50 సంవత్సరాలలోపు పనిచేస్తున్న పురుష ఉపాధ్యాయులను బదిలీ చేయాలని కూడా నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. గత సంవత్సరం మార్గదర్శకాలే ఇప్పుడూ వర్తిస్థాయని ఆయన తెలిపారు. ఈ బదిలీల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియను 15వ తేదీతో పూర్తివుతుందని ఆయన అన్నారు. ముఖ్యంగా కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీల ప్రక్రియను కొనసాగిస్తామని ఆయన అన్నారు. సిఫార్సుల లేఖల ద్వారా బదిలీలు జరగవని ఆయన స్పష్టం చేశారు. 2012 డీఎస్సీ మొదటి లిస్టు ఉద్యోగాలపై కొన్ని లీగల్‌ సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కార దిశలో ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆయన అన్నారు. ముఖ్యంగా ఎంసెట్‌, నీట్‌ పరీక్షల నిర్వహణపై ఇతర రాష్ట్రాల్లో కూడా స్టడీ చేస్తున్నామన్నారు. కొత్త డీఎస్సీని నిర్వహిస్తామని, దాదాపు 20వేలకు పైచిలుకు ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేస్తామన్నారు. టెట్‌, డీఎస్సీ కలిసి నిర్వహించే అంశంపై పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. ముఖ్యంగా జిల్లా సెలక్షన్‌ కమిటీల ద్వారానే ఈ ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ సాగుతుందనిఆయన అన్నారు. టెన్త్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం తక్కువ ఉన్న పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను మారుమూల ప్రాంతాలకు బదిలీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. రెండు సంవత్సరాల రిటైర్మెంట్‌ ఉన్న వారికి ఈ బదిలీ ప్రక్రియలో మినహాయింపు ఇవ్వనున్నట్టు తెలిపారు. ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పథకాలను ముఖ్యమంత్రి సహచర మంత్రులతో చర్చించడంలేదన్నది అవాస్తవని ఆయన అన్నారు. అందుబాటులో ఉన్న మంత్రులతో చర్చించిన అనంతరం ముఖ్యమంత్రి కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నారని మంత్రి పార్థసారథి తెలిపారు.