పారదర్శకంగా రుణాల మంజూరు
పురపాలక అధ్యక్షురాలు మనీష
ఆదిలాబాద్,మే25(జనంసాక్షి): బీసీ కార్పొరేషన్ రుణాల మంజూరు పక్రియలో ఎలాంటి లోటుపాట్లు ఉండవని, పారదర్శకంగా సాగుతుందని పురపాలక అధ్యక్షురాలు రంగినేని మనీష అన్నారు. బీసీ రుణ దరఖాస్తుల స్వీకరణ కోసం రెండు రోజుల పాటు స్థానిక టీఎన్జీఓ సంఘ భవనంలో ఏర్పాటుచేసిన వార్డు సభ ముగిసింది. రెండో రోజు 19 నుంచి 36 వార్డులకు చెందిన లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు, బ్యాంకు అంగీకారపత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా పురపాలక అధ్యక్షురాలు మాట్లాడుతూ.. అర్హులైన అందరికీ రుణాలు మంజూరుచేయనున్నట్లు తెలిపారు. డబ్బులు ఇస్తే రుణాలు ఇప్పిస్తామని చెప్పే దళారుల మాటలను నమ్మవద్దని సూచించారు. మంత్రి జోగురామన్న బీసీ సంక్షేమశాఖ మంత్రిగా రుణాల మంజూరు కోసం భారీగా నిధులు విడుదల చేయించేందుకు కృషిచేస్తున్నారని చెప్పారు. అనంతరం లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమంలో పుర కమిషనర్ మారుతీ ప్రసాద్, కౌన్సిలర్లు వెంకన్న, బండారి సతీష్, కలాల శ్రీనివాస్, వాఘ్మారే శైలేందర్, మేస్రం కృష్ణ, ప్రకాష్, మెప్మా అధికారి సుభాష్, తెరాస నాయకులు కొండ గణెళిష్, అశోక్‌స్వామి, డొంగ్రె మహేష్, మాజీ కౌన్సిలర్ అంబకంటి అశోక్ తదితరులు పాల్గొన్నారు.