పారిశుద్ధ్య పనులు పరిశీలించిన ఎంపీడీవో
గ్రామాల్లో పారిశుధ్యంలోపిస్తే కఠిన చర్యలు
బోనకల్ , అక్టోబర్01 ,(జనంసాక్షి ):
శుక్రవారం జనంసాక్షి ప్రచురించిన” పడకేసిన పారిశుధ్యం ! ముదురుతున్న విష జ్వరాలు” కథనానికి స్పందనగా బోనకల్ మండలంలోని పలు గ్రామలలో శనివారం ఎంపీడీవో వేణుమాధవ్ పర్యటించి పలు పారిశుద్ధ్య పనుల పురోగతిని పరిశీలించారు. గ్రామలలో జరుగుతున్న మురుగునీరు తొలగింపు తదితర పారిశుద్ధ్య పనుల కార్యక్రమంలో పాల్గొని పలు సూచనలు సలహాలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ గ్రామాలలో పారిశుద్ధ్యం లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. సీజనల్ వ్యాధులు ముదిరే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ ఎంతో అప్రమత్తతో వ్యవహరించాలని ఎవరికివారు స్వయం పరిశుభ్రత పాటించాలని ప్రజలకు సూచించారు. నీరు నిల్వ ఉన్నచోట గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో దోమల మందు పిచికారి చేయించారు. అన్ని గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేయించారు .ఈ సందర్భంగా పలువురు ప్రజలు మాట్లాడుతూ జనంసాక్షి కథనానికి స్పందనగా కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా వెంటనే స్పందించి పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేయించిన ఎంపీడీవో వేణుమాధవ్ కు ధన్యవాదాలు తెలిపారు.