పారిశుధ్య నిర్వహణలో శ్రద్ద అవసరం
డెంగీ తదితర వ్యాధులు వ్యాప్తి చెందకుండా చూడాలి
అధికారులతో టెలికాన్ఫరెన్స్‌లో సిఎం చంద్రబాబు
అమరావతి,సెప్టెంబర్5(జనం సాక్షి): పారిశుద్య నిర్వహణలో బాధ్యతగా వ్యవహరించాలని అధికరాఉలకు సిఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అసమర్ధంగా వ్యవహరిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. డెంగీ నియంత్రణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాలు, వార్డుల్లో సిమెంట్ రోడ్లు, డ్రెయిన్లు నిర్మించామని, పారిశుధ్యం మెరుగు పరిచామని, పచ్చదనం పెంచుతున్నామని అన్నారు. విశాఖకు ఎన్నో అవార్డులు వచ్చాయని తెలిపారు. నాలుగేళ్లలో ఎంతో ప్రగతి సాధించామని…అయినా అంటువ్యాధులు ప్రబలడం బాధాకరమని అన్నారు. మరో రెండు రోజుల్లో వ్యాధులను పూర్తిగా అదుపు చేయాలని బాబు ఆదేశించారు. పారిశుధ్య పరిస్థితుల్లో మార్పు రావాలని, లేదంటే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటిస్తామని తెలిపారు. విశాఖలో 33, గుంటూరులో 20 హాట్‌స్పాట్లలో పారిశుధ్యం మెరుగుపరచాలని ఆదేశించారు. విశాఖ, అనంతపురం, గుంటూరు, విజయనగరంపై మరింత శ్రద్ధ పెట్టాలని సూచించారు. అధికారుల అసమర్ధత వల్ల ప్రజలు ఇబ్బంది పడకూడదని బాబు అన్నారు. వ్యాధి నివారణ చర్యలపై ప్రజల్లో అవగాహన పెంచాలని తెలిపారు. పట్టణాలలో మెప్మా కార్యకర్తలు చురుకుగా స్పందించాలన్నారు. వైద్యఆరోగ్యశాఖ, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంగా పనిచేయాలని సూచించారు. ప్రతి హాట్ స్పాట్ బాధ్యత ఒక సీనియర్ అధికారికి అప్పగించాలని బాబు ఆదేశించారు. దోమల బెడదను పూర్తిగా నివారించాలని, రక్షిత తాగునీటిని అందుబాటులో ఉంచాలని అధికారులకు తెలిపారు. ‘మెరుగైన జీవన పరిస్థితుల కల్పన మనందరి బాధ్యత’ని పేర్కొన్నారు. మురుగు నిల్వ ప్రదేశాల్లో ఆయిల్ బామ్స్ వేయాలని సీఎం చంద్రబాబు తెలిపారు.