పార్టీపరంగా బీసీలకు 42% టికెట్లు
` స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ కీలక నిర్ణయం
` అంతకుముందే నామినేటెడ్ పదవుల భర్తీ
` సీఎం రేవంత్‌రెడ్డితో పీసీసీ కోర్ కమిటీ భేటీలో నిర్ణయం
` జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజ్యాంగ పరిరక్షణ కోసం,పౌర హక్కుల ను కాపాడటం కోసం పని చేశారు : సీఎం రేవంత్ రెడ్డి
` ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఆయన ఎంపిక పట్ల ఖర్గే,సోనియా,రాహుల్‌లకు కృతజ్ఞతలు తెలిపిన ముఖ్యమంత్రి
` ఈ అంశంపై భట్టి, ఉత్తమ్, శ్రీధర్‌బాబు, పొన్నం, సీతక్కలతో న్యాయసలహా సంప్రదింపుల కమిటీ ఏర్పాటు
హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించిన నేతలు.. పార్టీపరంగా బీసీలకు 42 శాతం టికెట్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఇవాళ సాయంత్రం గాంధీభవన్‌లో నిర్వహించిన కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పలు అంశాలపై నేతలు చర్చించారు.రాష్ట్రస్థాయిలో పెండిరగ్‌లో ఉన్న కమిటీల నిర్మాణంపై చర్చించారు. ఏఐసీసీ పిలుపు మేరకు ఓట్ చోరీ, గద్దీ ఛోడ్ ఉద్యమం చేపట్టాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన లోగోను ఆవిష్కరించారు. యూరియా కొరతపై భారత రాష్ట్ర సమితి, భాజపా చేస్తున్న రాజకీయాలు కూడా నేతల మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీనియర్ నేతలు వీహెచ్, జానారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ‘‘ ఉప రాష్ట్ర పతి అభ్యర్థి గా జస్టిస్ సుదర్శన్ రెడ్డి ని ఇండియా కూటమి అభ్యర్థిగా ప్రకటించి నందుకు మల్లిఖార్జున ఖర్గే,సోనియా గాంధీ,రాహుల్ గాంధీ కి ధన్యవాదాలు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజ్యాంగ పరిరక్షణ కోసం,పౌర హక్కుల ను కాపాడటం కోసం పని చేశారు . రాహుల్ గాంధీ,పార్టీ ఆదేశాల ప్రకారం రాష్ట్రం లో కులగణన చేపట్టారు. బీసీ లకు విద్యా,ఉద్యోగాలలో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తు మంత్రి వర్గం లో ఆమోదించి అసెంబ్లీ లో బిల్ పాస్ చేసుకున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తు విడిగా మరో బిల్ తీసుకొచ్చాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం మించకుండా కేసీఆర్ చట్టం తెచ్చారు.ఈ అడ్డంకిని తొలగించడానికి ఆర్డినెన్స్ తెచ్చాం. కేసీఆర్ తెచ్చిన చట్టాన్ని సవరించడానికి ఆర్డినెన్సు తెచ్చాం..దాన్ని గవర్నర్ కేంద్రానికి పంపారు.బీసీ లకు మేలు జరగాల్సిందే..రాహుల్ గాంధీ మాట నిలబడాలి. కేసీఆర్ తెచ్చిన చట్టం ప్రకారం బీసీ లకు ఒక్క శాతం రిజర్వేషన్ కూడా రాదు. 90 రోజులలో రాష్ట్రపతి బిల్లులను ఆమోదించాలన్న అంశం పైన సుప్రీమ్ కోర్టు లో మన రాష్ట్ర వాదనలు వినిపించడం కోసం ఇద్దరు న్యాయవాదులను నియమించాం. అందులోనే రాష్ట్రపతి దగ్గర ఉన్న మన బీసీ బిల్లు అంశం ప్రస్తావనకు వస్తుంది.విడిగా సుప్రీం కోర్టు కు వెళ్తే కేసు లిస్ట్ కావడానికి బాగా సమయం పడుతుంది.బీహార్ లో రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న ఓట్ చోరీ పాదయాత్ర కు ఈ నెల 26 న హాజరవుతా. బీఆర్ ఎస్ ,బీజేపీ కలిసి యూరియా కొరత పైన డ్రామా లు ఆడుతున్నాయి. యూరియా ఇచ్చే పార్టీ కే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తానని కేటిఆర్ అనడం లో నే వాళ్ల తీరు అర్థం అవుతుంది.యూరియా కోసం నాలుగు సార్లు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా,అనుప్రియా పటేల్ ను కలిశాను. యూరియా పంపిణీ పైన శేత్రస్థాయి లో మానిటరింగ్ ను పెంచాలి’’ అని అన్నారు.
అధికార లాంఛనాలతో సురవరం అంత్యక్రియలు
అధికారులకు సిఎం రేవంత్ ఆదేశం
హైదరాబాద్,ఆగస్ట్23(జనంసాక్షి):సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరపాలని సిఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వెంటనే ఈ ఆదేశాలను అమలు చేయాలని దానికి సంబంధించిన ఏర్పాట్లు- చేయాలని సిఎస్‌ను సిఎం రేవంత్ ఆదేశించారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సురవరం సుధాకర్ రెడ్డి గచ్చిబౌలి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. నేడు మధ్యాహ్నాం సురవరం భౌతికకాయానికి అధికారం లాంఛనాలతో గౌరవ సూచకంగా అధికారులు నివాళ్లు అర్పించనున్నారు. ఈ కార్యక్రమానికి సిఎం రేవంత్‌రెడ్డితో పాటు- మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయయుడు, వివిధ పార్టీల నాయకులు హాజరయ్యే అవకాశం ఉందని తెలిసింది.