పార్టీలకు అతీతంగా తెలుగు మహాసభల
విజయవంతానికి సహకరించండి : సీఎం
హైదరాబాద్, సెప్టెంబర్ 20 (జనంసాక్షి): ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. డిసెంబర్ 27, 28, 29 తేదీల్లో తిరుపతిలో జరిగే నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ముఖ్యమంత్రి కోరారు. గురువారం జూబ్లీహాల్‌లో జరిగిన రాష్ట్ర పర్యాటక శాఖమంత్రి వట్టి వసంతకుమార్ అధ్యక్షతన వివిధ పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులతో పాటు అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తదితరులుపాల్గొన్నారు. తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఈ ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి కోరారు. 37 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. మొదటిసారి 1975లో రాష్ట్రంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయని అన్నారు. ఈ సభలు విజయవంతమయ్యేందుకు పార్టీలకు అతీతంగా నేతలంతా ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. తెలుగు భాష, సంస్కృతి ప్రతిబింబించే విధంగా గ్రామాలలో, మండలాల్లో, జిల్లాల్లో జరిగిన ఆసక్తిగల అంశాలను వెలుగులోకి తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని ఆయన కోరారు. 1975లో జరిగిన తొలి ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్న వారి కుటుంబ సభ్యులు కూడా ఈ సమావేశంలో ఉన్నారని, వారి సలహాలు, సూచనలు ఎంతో అవసరమని ముఖ్యమంత్రి అన్నారు. ప్రపంచంలో వివిధ రంగాల్లో పేరు, ప్రఖ్యాతులు గడించిన తెలుగువారందరినీ ఈ సభల్లో గౌరవించడం గొప్ప విషయమని కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రపంచ మహాసభలు విజయవంతమయ్యేందుకు మీడియా సహకారం అవసరమని ముఖ్యమంత్రి అన్నారు. రాబోయే తరాలకు గర్వకారణంగా ఉండే విధంగా ఈ ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించాలని ముఖ్యమంత్రి అన్నారు. సమయం తక్కువగా ఉందని, ఏర్పాట్లు యుద్ధ ప్రతిపాదికన చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశాలను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.