పార్లమెంట్‌ను కుదిపిన హైదరాబాద్ పేలుళ్లు
సర్కార్‌పై ధ్వజమెత్తిన విపక్షాలు
ఉగ్రవాదాన్ని ఉపేక్షించం
లోక్‌సభలో షిండే
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22 (జనంసాక్షి):
హైదరాబాద్ పేలుళ్ల ఘటన పార్లమెంట్‌ను కుదిపేసింది. ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఉభయ సభల్లో విపక్షాలు నిలదీశాయి. ప్రధాన పక్షమైన బీజేపీ యూపీఏ సర్కారును కడిగి పాడేసింది. శుక్రవారం ఉదయం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే.. ఉభయ సభలు దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల మృతులకు నివాళులర్పించాయి. ఉగ్రవాద దాడులను ఖండిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించాయి. ప్రశ్నోత్తరాలను రద్దు చేసి, పేలుళ్ల ఘటనపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టడంతో ఉభయ సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి. లోక్‌సభ తిరిగి ప్రారంభమైన అనంతరం.. విపక్షాలు సర్కారుపై విరుచుకుపడ్డాయి. దాడుల సమాచారం ఉన్నప్పటికీ ఎందుకు నిరోధించలేక పోయారని నిలదీశాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే ఈ ఘటనకు బాధ్యత వహించాలని, బాధిత కుటుంబాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాయి. విపక్షాల ఆందోళనలతో లోక్‌సభ పలుమార్లు వాయిదా పడింది. విపక్షాల విమర్శల మధ్య కేంద్ర ¬ం మంత్రి సుశీల్‌కుమార్ షిండే లోక్‌సభలో ప్రకటన చేశారు. అత్యంత రద్దీగా ఉండే దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంలో గురువారం సాయంత్రం 6.58, 7.01 గంటలకు పేలుళ్లు జరిగాయని తెలిపారు. పేలుళ్ల ఘటనలో 16 మంది మృతి చెందారని, 119 మంది గాయపడ్డారని ప్రకటించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని తెలిపారు. ఘటన జరిగిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించిందని తెలిపారు. 25 అంబులెన్సుల్లో క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించిందని తెలిపారు. పోలీసు, ఎన్‌ఐఏ బృందాలు ఘటనా స్థలాన్ని స్వాధీనం చేసుకొని సాక్ష్యాలు సేకరించాయని చెప్పారు. రాష్ట్ర ఫోరెన్సిక్ విభాగం కూడా అన్ని ఆధారాలు స్వాధీనం చేసుకుందని తెలిపారు. పేలుళ్లకు సంబంధించి మలక్‌పేట, సరూర్‌నగర్ పీఎస్‌లో రెండు కేసులు నమోదు చేశామని వివరించారు. సైకిళ్లకు బాంబులు అమర్చి పేల్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. పేలుళ్లలో ఐఈడీ ఉపయోగించారని చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని చెప్పారు. ఉగ్ర దాడుల నిరోధానికి కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటుందని, దోషులు ఎంతటి వారైనా వదలబోమన్నారు. ఈ ఘటనపై ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తోందని తెలిపారు. అయితే, షిండే ప్రకటనపై బీజేపీ మండిపడింది. ¬ం మంత్రి ప్రకటన సాదాసీదాగా ఉందని సుష్మస్వరాజ్ విమర్శించారు. మెదటి పేరాలో ఘటన, రెండో పేరాలో పరిహారం, మూడో పేరాలో ముక్తాయింపు తప్ప షిండే ప్రకటనలో ఏవిూ లేదని ధ్వజమెత్తారు. కేంద్రం సమాచారం అందించి ఉంటే.. ఆంధ్రప్రదేశ్ ఎందుకు అప్రమత్తం కాలేదని ప్రశ్నించారు. దాడుల సమాచారాన్ని చెప్పడమే తప్ప కేంద్రం చర్యలకు ఉపక్రమించిందా? లేదా? రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన స్తానిక నాయకుల ప్రభావం పేలుళ్లపై ఉందా? అని నిలదీశారు. హైదరాబాద్ ఘటన అత్యంత దురదృష్టకరమని.. ఇలాంటి దాడులు జగరకుండా కేంద్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో వెల్లడించాలని డిమాండ్ చేశారు. దీనిపై తక్షణమే చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. అయితే, చర్చ చేపట్టేందుకు ప్రభుత్వం నిరాకరించింది. ¬ం మంత్రి రాజ్యసభలో ప్రకటన చేయాల్సి ఉందని, నిర్దిష్ట సమయం నిర్ణయిస్తే చర్చకు సిద్ధమని మంత్రి కమల్‌నాథ్ పేర్కొన్నారు. అయితే, తక్షణమే చర్చించాలని విపక్షాలు పట్టుబట్టడంతో సభ వాయిదా పడింది.
అత్యంత విషాదకరం: సుష్మ
హైదరాబాద్ జంట పేలుళ్ల ఘటనను లోక్‌సభలో విపక్షనేత సుష్మాస్వరాజ్ ఖండించారు. ఇది అత్యంత విషాదకరమైన ఘటనగా ఆమె అభివర్ణించారు. లోక్‌సభలో జంట పేలుళ్ల ఘటనపై జరిగిన చర్చలో మాట్లాడుతూ… సుష్మాస్వరాజ్ సర్కారుపై నిప్పులు చెరిగారు. కేంద్రం వద్ద దాడుల సమాచారం ఉన్నా.. ఘటనలు జరుగుతూనే ఉన్నాయని అన్నారు. అమాయకుల ప్రాణాలను బలితీసుకోవడంతో ఉగ్రవాదులు పైచేయి సాధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాద దాడులపై ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నా.. భద్రతను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమైందని నిలదీశారు. ‘ఇంటెలిజెన్స్ హెచ్చరికలను అన్ని రాష్టాల్రకు అందజేశామని, భద్రతను అప్రమత్తం చేశామని ¬ం మంత్రి చెప్పారు. అయినా దాడులు ఎలా జరిగాయి? అమాయకులు ఎందుకు బలయ్యారు?’ అని సుష్మ ప్రశ్నించారు. ప్రభుత్వాలు పూర్తిగా విఫలయమయ్యాయని ధ్వజమెత్తారు. ఉగ్రవాద దాడులను నిరోధించేందుకు రాజకీయ పక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. దేశంలో ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు ఐక్యంగా పోరాడాలని సూచించారు. ఉగ్రవాదానికి మతం, మానవత్వం లేదని, ఉగ్రవాదిని ఉగ్రవాదిగానే చూడాలన్నారు. హైదరాబాద్ బాంబు పేలుళ్లకు ¬ం మంత్రే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
అడ్డుకోవడానికి ఉన్న అడ్డంకులేమిటి: ఎస్పీ
ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అడ్డంకులేమిటని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ ప్రశ్నించారు. ఉగ్రవాదంపై పోరులో దేశం మొత్తం ఏకతాటిపై ఉందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమాచారమున్నప్పటికీ దాడులు జరగడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలని, ప్రజల రక్షణకు ప్రభుత్వం హావిూ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పొరుగు దేశాల్లోని పరిస్థితులను ఆసరాగా చేసుకొని.. ఉగ్రవాదులు సరిహద్దులు దాటుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతోందా?
కేంద్రం ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోక పోవడం వల్లే ఈ దుర్ఘటన సంభవించిందని శరద్ యాదవ్ మండిపడ్డారు. కేంద్రం హెచ్చరిస్తే… రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతున్నదా? అని ప్రశ్నించారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు కేంద్రానికి బాసటగా నిలుస్తామన్నారు. యూపీఏ సర్కారు అతివిశ్వాసమే ఈ ఘటనకు కారణమని తృణమూల్ కాంగ్రెస్ మండిపడింది. ఆ పార్టీ నేత సుదీప్ బందోపాధ్యాయ లోక్‌సభలో మాట్లాడుతూ.. దేశంలో పేలుళ్లు జరుగుతాయని తెలిసి కూడా ప్రభుత్వం స్పందించక పోవడం దారుణమన్నారు. సర్కారు అతివిశ్వాసమే కొంప ముంచిందని విమర్శించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కేంద్రం తీసుకొనే చర్యలకు తృణమూల్ అండగా నిలుస్తుందని చెప్పారు. ‘ఉగ్రవాద పోరులో మనమంతా ఐక్యంగా ఉన్నాం. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా.. మేం పూర్తిగా మద్దతునిస్తాం’ అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సమాచారమిచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ఎంపీ బసుదేవ్ ఆచార్య నిలదీశారు. ఈ ఘటనపై ¬ం మంత్రి సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాజ్యసభలోనూ..
ఉదయం రాజ్యసభ సమావేశం ప్రారంభం కాగానే.. హైదరాబాద్ పేలుళ్లను తీవ్రంగా ఖండించింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు కలిసికట్టుగా పోరాడాలని రాజ్యసభ చైర్మన్ హమాదీ అన్సారీ కోరారు. సభ్యులంతా రెండు నిమిషాలు పాటించారు. అనంతరం పేలుళ్లపై చర్చ చేపట్టాలని విపక్షాలు పట్టుబట్టాయి. ప్లకార్డులు ప్రదర్శిస్తూ వెల్‌లోకి చొచ్చుకెళ్లాయి. దీంతో సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది. సభ తిరిగి ప్రారంభం కాగానే సభ్యులు ఈ ఘటనపై చర్చకు పట్టుబట్టి సభాకార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో అన్సారీ సభను మధ్యాహ్నం 2.30కు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన అనంతరం ¬ం మంత్రి షిండే లోక్‌సభలో చేసిన ప్రకటననే రాజ్యసభలోనూ చేశారు. అయితే, దీనిపై విపక్షాలు మండిపడ్డాయి. హైదరాబాద్‌లోనే తరచూ పేలుళ్లు ఎందుకు జరుగుతున్నాయని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. నిఘా వర్గాల సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు చేరవేయడంతోనే కేంద్రం చేతులు దులుపుకుంటుందా? భద్రతను కట్టుదిట్టం చేయాల్సిన అవసరం లేదా? అని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం హెచ్చరించినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపట్టలేదని నిలదీశారు. ప్రభుత్వ తీరు, ¬ం మంత్రి ప్రకటనపై వెంకయ్య ధ్వజమెత్తారు. ప్రభుత్వ ప్రకటన ఉగ్రవాదులకు హెచ్చరికగా ఉండాలని సూచించారు. ఇద్దరు ఉగ్రవాదులను ఉరి తీసినందుకే పేలుళ్లు జరిగాయని.. పేలుళ్ల తీవ్రతను ప్రభుత్వం గుర్తించడం లేదని మండిపడ్డారు. పాకిస్తాన్ భారత్‌కు తరచూ సవాళ్లు విసురుతోందని, ప్రభుత్వం వాటిని అర్థం చేసుకోవడం లేదని విమర్శించారు. కసబ్, అఫ్జల్ ఉరితీత తర్వాత ప్రతీకారం తీర్చుకుంటామని పాకిస్తాన్‌లో హఫీజ్ సయీద్ ప్రకటనలు చేశారని.. అయినా ప్రభుత్వం ఎందుకు అప్రమత్తం కాలేదని ప్రశ్నించారు. ఉగ్రవాద దాడులపై నాయకుల్ని ప్రజలు నిలదీస్తున్నారు.. అందుకే ఈ ఆవేదన అని అన్నారు. ఉగ్రవాదంపై చర్చలు అనవసరమని.. చర్యలు కావాలని పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్రం కళ్లు తెరవాలని సూచించారు. అంతర్గత నిఘా వ్యవస్థను మరింత ముమ్మరం చేయాలని ప్రభుత్వానికి హితవు పలికారు. అందరూ కలిసి ముష్కరులను నిలువరించాలని పేర్కొన్నారు.