పార్లమెంట్‌ను స్తంభింప చేస్తాం

వెల్‌లోకి దూసుకుపోతాం
తెలంగాణపై యూపీఏ వైఖరిని తేల్చేస్తాం
తెలంగాణకు ఒక్కరూపాయి కూడా ఇవ్వనని
సీఎం అనడం బరితెగింపే : కేసీఆర్‌
హైదరాబాద్‌, మార్చి 17 (జనంసాక్షి) :
కేంద్రం తెలంగాణ ప్రక్రియను ప్రారంభించకపోతే పార్లమెంట్‌ను స్తంభింపజేస్తామని, రాష్ట్రంలో భూకంపాలు సృష్టిస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌ హెచ్చరించారు. కేంద్రం తెలంగాణ ఇస్తుందో ఇవ్వదో ఏప్రిల్‌లో తేలిపోతుందని అన్నారు. ఆ తర్వాత ఉద్యమం తీరుతెన్నులు ఎలా ఉంటాయో అంతా చూస్తారని అన్నారు. పార్లమెంట్‌ సమావేశాల్లో పాల్గొనేందుకు ఆయన ఆదివారం ఢిల్లీ వెళ్లే ముందు మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై ఇక ఢిల్లీలోనే తేల్చుకుంటామని చెప్పారు. తెలంగాణకు మద్దతు ఇచ్చే మాయావతి, శరద్‌ పవార్‌, అజిత్‌సింగ్‌ వంటి నేతలతో మాట్లాడతామన్నారు. తెలంగాణ అనుకూల పార్టీలన్నీంటిని కూడగడతామని చెప్పారు. పార్లమెంట్‌ సమావేశాలను రేపటి నుంచి తెలంగాణ కోసం స్తంభింప చేస్తామని చెప్పారు. వెల్‌లోకి దూసుకెళ్లి, పోడియం చుట్టుముట్టి తెలంగాణ కోసం పట్టుపడతామన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ వాణిని బలంగా వినిపిస్తామన్నారు. ప్రస్తుత సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేస్తామన్నారు. యూపీఏ వాగ్దానాన్ని ఇప్పటికైనా నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలను ప్రజాస్వామ్యవాదులు హర్షించరని అన్నారు. తెలంగాణకు నిధులు ఇవ్వబోమని ముఖ్యమంత్రి అనడం సభాహక్కుల ఉల్లంఘనేనని కేసిఆర్‌ అన్నారు. ముఖ్యమంత్రిపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. దీనిపై న్యాయనిపుణులతో సంప్రదిస్తున్నానని చెప్పారు. హోదా పెరిగే కొద్ది ముఖ్యమంత్రి హుందాగా వ్యవహరించాలని అన్నారు. శాసనసభలో బస్తీమే సవాల్‌ అనడం ముఖ్యమంత్రికి పద్ధతి కాదని ఆయన అన్నారు. ఆయన వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయన్నారు. తెలంగాణకు నిధులు ఇవ్వబోనని అనడం అర్ధరహితమన్నారు. ప్రభుత్వ నిధులు ముఖ్యమంత్రి అబ్బసొత్తు కాదు, ఆయన సీల్డ్‌కవర్‌ ముఖ్యమంత్రి అని మరిచిపోకూడదని అన్నారు. ఆయన రాష్ట్రానికి అంతా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారని గుర్తుంచుకోవాలన్నారు. ఆయన బరితెగిస్తే మిగతా వారు చూస్తూ ఊరుకోబోరనే విషయం గుర్తించాలన్నారు. అవిశ్వాస తీర్మానం సందర్భంలో టీడీపీ అసలు స్వరూపం బయటపడిందన్నారు. అవిశ్వాస తీర్మానానికి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఈ చర్య ద్వారా టీడీపీ తనకు తానే ఆత్మహత్య చేసుకుందని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌ స్థాపించిన టీడీపీ స్ఫూర్తిని కోల్పోయిందన్నారు. ఇప్పుడున్నది సన్నాసుల టీడీపీ అని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో అవిశ్వాస తీర్మానంపై ప్రధాన ప్రతిపక్షం సానుకూలంగా స్పందించకపోవడం ప్రపంచంలో ఎక్కడా లేదని అన్నారు. అవిశ్వాస తీర్మానానికి ఎంఐఎం మద్దతు ఇవ్వకుండా పారిపోయిందని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. రానున్న రోజుల్లో తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీలకు ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదని హెచ్చరించారు.