పార్లమెంట్‌ ముట్టడికి సిక్కుల యత్నం

న్యూఢిల్లీ, మే 6 (జనంసాక్షి) :
సిక్కులు ఆందోళనను ఉద్ధృతం చేశా రు. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతి భవన్‌, పార్లమెంట్‌ను ముట్టడిం చేందుకు యత్నించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు. 1984 నాటి సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్‌ నేత సజ్జన్‌కుమార్‌ను ఉరి తీయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం ఉదయం పార్లమెంట్‌ను ముట్టడించేందుకు తరలివచ్చారు. దాదాపు 500 మంది సిక్కులు పార్లమెంట్‌కు వెళ్లే అత్యంత భద్రత ఉండే విజయ్‌ చౌక్‌ను దిగ్బంధించారు. ఎంపీలు పార్లమెంట్‌కు వెళ్లకుండా అడ్డుకొనేందుకు యత్నిం చారు. దీంతో పలువురు ఎంపీలు తమ వాహనాలు దిగి నడుచుకుంటూ పార్లమెంట్‌కు చేరుకున్నారు. జనతా దళ్‌ చీఫ్‌ శరద్‌ యాదవ్‌ కూడా తన కారు దిగి నిరసనకారులను దాటుకొని పార్లమెంట్‌కు వచ్చారు. మరోవైపు, సిక్కుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. వాటర్‌ క్యానన్లను సిద్ధంగా ఉంచారు. రోడ్డుపై బైఠాయించిన నిరసనకారులను అదుపులోకి తీసుకొన్నారు. ఈ సందర్భంగా వాగ్వాదం, తోపులాట జరిగింది. ఆందోళనకారులందరినీ పార్లమెంట్‌ స్ట్రీట్‌ పోలీసుస్టేషన్‌కు తరలించారు. మరోవైపు, రాష్ట్రపతి భవన్‌ను ముట్టడించేందుకు యత్నించిన వారినీ నిలువరించారు. రాష్ట్రపతి భవన్‌తో పాటు ప్రధాని కార్యాలయం ఉన్న నార్త్‌ బ్లాక్‌తో పాటు సౌత్‌ బ్లాక్‌లకూ, అలాగే,  ముఖ్యమైన మంత్రుల ఇళ్ల భద్రత ఏర్పాటు చేశారు. బారికేడ్లు పెట్టి రాకపోకలను నియంత్రించారు. 1984 సిక్కుల ఊచకోత కేసులో ట్రయల్‌ కోర్టు కాంగ్రెస్‌ నేత సజ్జన్‌కుమార్‌ను నిర్దోషిగా విడిచిపెట్టడాన్ని నిరసిస్తూ వారం రోజులు సిక్కులు ఆందోళన చేస్తున్నారు. జంతర్‌మంతర్‌ వద్ద నిరాహార దీక్షకు దిగిన ఆందోళనకారులు ఇప్పటికే ప్రధాని, సోనియా సహా పలువురి నివాసాలు ముట్టడించేందుకు యత్నించారు. బాధితులకు న్యాయం జరగాలని, సజ్జన్‌ను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.