పాలకులు లెఫ్టినెంట్ గవర్నర్‌లేనట
– ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ,ఆగస్టు 4(జనంసాక్షి):అరవింద్ కేజీవ్రాల్ ప్రభుత్వానికి గట్టి దెబ్బ తగిలింది. ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఢిల్లీ మంత్రివర్గం ఇచ్చే సలహాల ప్రకారం లెఫ్టినెంట్ గవర్నర్ నడుచుకోవాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని 239వ అధికరణం ఇంకా అమలులోనే ఉందని, దాని ప్రకారం ఢిల్లీ ఇంకా కేంద్రపాలిత ప్రాంతమే అవుతుందని తెలిపింది. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అధికారాలను ప్రశ్నిస్తూ ఆప్ సర్కారు హైకోర్టులో వేసిన పిటిషన్ బెడిసికొట్టింది. ఢిల్లీలో కార్యనిర్వాహక అధికారాలు లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వేనని కోర్టు స్పష్టంచేసింది. స్థానిక ప్రభుత్వ సలహాను పాటించాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతమని, ఇక్కడి శాంతిభద్రతలు, ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీలాంటి కీలక ఏజెన్సీలపై ఢిల్లీ ప్రభుత్వానికి ఏ నియంత్రణ ఉండదని కోర్టు తెలిపింది. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనుమతి లేకుండా ఢిల్లీ కేబినెట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోడానికి వీల్లేదని స్పష్టంచేసింది. ఢిల్లీపై ఆధిపత్యం కోసం కొన్ని నెలలుగా లెఫ్ట్‌నెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్‌తో పోరాడుతున్న కేజీవ్రాల్‌కు కోర్టు తీర్పు మింగుడుపడనిదే. నజీబ్ జంగ్ కేంద్రం ఆదేశాల ప్రకారం పనిచేస్తున్నారని కేజీవ్రాల్ ఆరోపిస్తుండగా.. కేజీవ్రాల్ ప్రొటోకాల్‌ను పాటించడం లేదని జంగ్ అంటున్నారు. ఢిల్లీలో బ్యూరోక్రాట్లను నియమించడం, పోలీసులపై అధికారాలను లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీచేసిన రెండు నోటిఫికేషన్లపై ఆప్ సర్కారు కోర్టుకెక్కింది. ముందుగా లెఫ్టినెంట్ గవర్నర్‌కు చెప్పకుండా మంత్రివర్గం ఎలాంటి నిర్ణయం తీసుకోడానికి వీల్లేదని కూడా కోర్టు చెప్పింది. కేందప్రభుత్వ అధికారులపై ఏసీబీ ఎలాంటి చర్యలు తీసుకోడానికి వీలు లేదని తెలిపింది. అయితే, ఈ తీర్పుతో తీవ్రంగా నిరాశ చెందిన ఢిల్లీ ప్రభుత్వం.. తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపింది.