పాలమూరు వలసల జిల్లా కాదు ఉపాధి జిల్లా

– ఊహించని విధంగా అభివృద్ధి చెందుతున్న జిల్లా
– దళితబంధు యూనిట్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్  , అక్టోబర్ 9 (జనంసాక్షి ):
వలసల జిల్లాగా పేరుగాంచిన మహబూబ్ నగర్  యువత వలసలు వెళ్ళే దశ నుంచి స్థానికంగానే  తాము ఉపాధి పొందడంతో పాటు మరో పది మందికి ఉపాధి చూయించే స్థాయికి ఎదగడం ఎంతో సంతోషించదగ్గ విషయమని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. జడ్చర్ల- మహబూబ్ నగర్ మార్గంలో మల్లె బోయినపల్లి తండా వద్ద… దళిత బంధు పథకం ఆర్థిక సాయంతో ఏర్పాటు చేసిన బ్రిక్స్, ఆర్గానిక్ పేపర్ ప్లేట్ల యూనిట్ ను మంత్రి ప్రారంభించారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత… వెనకబడిన జిల్లాగా ఉన్న మహబూబ్ నగర్ అభివృద్ధి చెందిన జిల్లాగా గుర్తింపు తెచ్చుకుందని మంత్రి తెలిపారు. రాజధానికి సమీపంలో ఉన్నందున మన జిల్లా అభివృద్ధికి అవకాశమే లేదని కొందరు పేర్కొన్నారని, అది తప్పని ఇప్పుడు నిరూపణ అయ్యిందన్నారు. జిల్లా కేంద్రం ఊహించని విధంగా అభివృద్ధిలో దూసుకుపోతుందని తెలిపారు. యువత అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, తమతోపాటు పదిమందికి ఉపాధి అందించే వారికి తామన్యుధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దళిత బంధు పథకం ద్వారా అనేకమంది నిరుద్యోగులు జీవితంలో స్థిరపడుతున్నారని మంత్రి తెలిపారు.మహబూబ్ నగర్, జడ్చర్ల మున్సిపల్ చైర్ పర్సన్లు కొరమోని నర్సింహులు, దోరేపల్లి లక్ష్మి రవీందర్, వైస్ చైర్మన్ గణేష్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.