పాలమూరు సస్యశ్యామలమే లక్ష్యం

ప్రాజెక్టులు అడ్డుకునే వారికి బుద్ది చెప్పాలి

కెసిఆర్‌తో నడిగడ్డకు న్యాయం: ఆల

మహబూబ్‌నగర్‌,నవంబర్‌22(జ‌నంసాక్షి): వలసతో వెనకబడిన పాలమూరు జిల్లాను స్యశ్యామలం చేయడానికి వేలాది కోట్లు వెచ్చించి ప్రాజెక్టులను నిర్మిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి అండగా నిలవాలని చెప్పారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే ప్రతి పక్షాలకు ప్రజలే బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. నిరుపేద ప్రజల సమస్యలను అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని, అందుకే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ప్రజా సంక్షేమానికే పెద్దపీట వేస్తుందని అన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ ద్వారా పేద మహిళలకు అండగా నిలిచారని అన్నారు. ఎమ్మెల్యేగా తాను నిరుపేద కుటుంబాలకు సహాయం చేస్తున్నందుకు ఎంతో ఆనందం కలుగుతుందన్నారు. రాష్ట్రంలో ఏ పేదింట్లో ఆడ పిల్ల పెళ్లి జరుగుతున్నా ఆ కుటుంబానికి రూ. లక్షా,116 ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో మరోమారు టిఆర్‌ఎస్‌ను ఆదరించి గెలిపించాలన్నారు. 60 ఏళ్ల వెనుకబాటుకు కారణమైన పార్టీలు ఏకమై మహాకూటమిగా మరోసారి కుట్రలను పన్నుతున్నాయని వాటిని తిప్పికొట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని పిలుపునిచ్చారు. నాయకులు, యువకులు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరగా వారిని కం డువా కప్పి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతాన్ని అన్ని విధాలుగా వెనుకబాటుకు గురిచేసిన కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు జతకట్టి మళ్లీ కుట్రపన్నుతున్నాయని ఆరోపించారు. గడిచిన నాలుగున్నర సంవత్సరాల్లో రాష్ట్రాన్ని దేశంలోనే అభివృద్ధి సంక్షేమంలో ప్రథమస్థానంలో నిలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పట్టం కట్టాలన్నారు. రైతుకు పంట పెట్టుబడి సహాయం, భీమా 24గంటల పాటు విద్యుత్‌ను అందజేయడమే కాకుండా సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రాజెక్టుల నిర్మాణాన్ని కూడా శరవేగంగా జరిపారన్నారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న కేసీఆర్‌ను మరోసారి సీఎం చేయాలని పిలుపునిచ్చారు.