పాలేరు పోరుకు స్వర్వం సిద్ధం

5

– నేడు పోలింగ్‌

ఖమ్మం,మే15(జనంసాక్షి): పాలేరు ఉప ఎన్నికకు సోమవారం పోలింగ్‌ జరగనుంది. పోలింగ్‌ కు సంబంధించిన ఏర్పాట్లను ఎన్నికల అధికారులు పూర్తి చేశారు. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగుతుంది. 6 గంటల వరకు క్యూలైన్లలో నిల్చున్న వారందరికీ ఓటేసే అవకాశం కల్పిస్తారు అధికారులు. టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి, రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బరిలో ఉండగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి రాంరెడ్డి సుచరితారెడ్డి, సీపీఎం నుంచి పోతినేని సుదర్శన్‌లతో పాటు 13 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు.పాలేరు నియోజకవర్గంలో మొత్తం 1,90, 351 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులు 93,463, మహిళలు 96,869 మంది ఉన్నారు. ఎన్నికల సిబ్బంది ఆదివారం మధ్యాహ్నం నుంచి తమకు కేటాయించిన పోలింగ్‌ స్టేషన్లకు చేరుకున్నారు. 1520 మంది పోలింగ్‌ సిబ్బంది, 25 మంది సెక్టోరియల్‌ ఆఫీసర్స్‌, 25 మంది సహాయ సెక్టోరియల్‌ ఆఫీసర్లు, 25 మంది రూట్‌ ఆఫీసర్లు విధులు నిర్వహించనున్నారు. మొత్తం 243 పోలింగ్‌ స్టేషన్లు ఉండగా, వాటిలో 74 సెన్సిటివ్‌ పోలింగ్‌ స్టేషన్లు, 68 హైపర్‌ సెన్సిటివ్‌ పోలింగ్‌ స్టేషన్లు, సాధారణ పోలింగ్‌ స్టేషన్లు ఉన్నాయి.ఈ ఉప ఎన్నికల్లో 12 మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ మోడల్‌ పోలింగ్‌ కేంద్రాల్లో ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లు రెడ్‌కార్పట్‌తో స్వాగతం పలుకనున్నారు. వికలాంగులకు వీల్‌ చైర్‌ సౌకర్యం, ఓటర్లకు తాగేందుకు చల్లని మినరల్‌ వాటర్‌, షామియానాలు, ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో ఓటరు ఎవరికి ఓటు వేశామని తెలుసుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. నియోజకవర్గంలోని 243 పోలింగ్‌ కేంద్రాల్లో వీవీప్యాట్‌ టెక్నాలజీ వినియోగించనున్నారు. వీవీప్యాట్‌ ద్వారా ఓటరు తాను ఎవరికి ఓటు వేశాననేది రూడిగా తెలుసుకోవచ్చు. ఓటింగ్‌ యంత్రాలకు ఈ యంత్రాన్ని అనుసంధానం చేయడం ద్వారా ఓటు ఎవరికి ఓటు వేశారని స్పష్టంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంది.