పాల్వాయి, ఆరెపల్లికి షోకాజ్
– మా వాళ్లెవరు పార్టీ మారరు
– టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్
హైదరాబాద్,జూన్ 11(జనంసాక్షి): కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు ముగ్గురు తెలంగాణ కాంగ్రెస్ నేతలపై తెలంగాణ పీసీసీ క్రమశిక్షణా సంఘం చర్యలు చేపట్టింది. కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు కె. మృత్యుంజయం, ఆరేపల్లి మోహన్‌లకు టీపీసీసీ క్రమశిక్షణా సంఘం నోటీసులు పంపినట్టు తెలుస్తోంది. శనివారం గాంధీభవన్‌లో తెలంగాణ పీసీసీ క్రమశిక్షణా సంఘం సమావేశం అయింది. ఈ నేపథ్యంలో మృత్యుంజయం, ఆరేపల్లి మోహన్ పరస్పర ఆరోపణలపై షోకాజ్ నోటీసులు పంపారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు పాల్వాయి గోవర్థన్ రెడ్డిని వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. అదేవిధంగా మృత్యుంజయం, ఆరేపల్లి మోహన్‌లు చేసిన ఆరోపణలపై కూడా వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. ఈ నెల 17న వివరణ ఇవ్వాల్సిందిగా ముగ్గురు నేతలను టీపీసీసీ క్రమశిక్షణా సంఘం ఆదేశించింది. జానారెడ్డిపై వ్యాఖ్యలు చేసినందుకు పాల్వాయికి.. కరీంనగర్ కాంగ్రెస్ భేటీలో అనుచితంగా వ్యవహరించినందుకు ఆరేపల్లికి
నోటీసులు ఇచ్చారు. వీరిద్దరూ ఈనెల 17న క్రమశిక్షణ సంఘం ముందు నేరుగా హాజరుకావాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
నేతలెవరూ పార్టీని వీడరు: ఉత్తమ్
కాంగ్రెస్ పార్టీ నుంచి నేతలెవరూ కాంగ్రెస్‌ను వీడరనేది తన నమ్మకమని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ గీత దాటిన నేతలు ఎంతటివారైనా వారిపై చర్యలు తప్పవని అన్నారు. శనివారం ఆయన హైదరాబాద్ లో విూడియాతో మాట్లాడారు. పార్టీని వీడాలనుకుంటున్న నేతలతో తాను మాట్లాడనని చెప్పారు. విభజన హావిూల అమలులో ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ విఫలమైందని ఉత్తమ్ తెలిపారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా హావిూలు నెరవేర్చలేదని మండిపడ్డారు. రైల్వేకోచ్ ప్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీల ఏర్పాటులో కదిలిక లేదని విమర్శించారు. తెలంగాణ ఇచ్చిన గాంధీ ఫ్యామిలీని టార్గెట్ చేసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా.. విభజన హావిూల అమలు కోసం ఎందుకు మాట్లాడటం లేదని ఉత్తమ్ ప్రశ్నించారు.సంతృప్తిగా ఉన్న నేతలతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామన్న ఉత్తమ్.. ప్రత్యక్షంగా, పరోక్షంగా పార్టీకి నష్టం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించమని హెచ్చరించారు.