పాల ఉత్పత్తులపై పెంచిన జీఎస్టీని తగ్గించాలి
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):పాలు , పాల అనుబంధ ఉత్పత్తులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ పేరుతో పన్నులు విధించడం పట్ల పాడి రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు సూర్యాపేట పట్టణంతో పాటు నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రాల్లో గురువారం నిరసన కార్యక్రమాలను నిర్వహించారు.టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పిలుపు మేరకు జీఎస్టీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు.జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి తెలంగాణ తల్లి విగ్రహం వరకు ఖాళీ క్యాన్లు,పాడి పశువులతో ర్యాలీ నిర్వహించి పీఎం మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు.ఈ సందర్బంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పాలపై పన్ను విధించిన ఘటన దేశచరిత్రలో ఎన్నడు జరుగలేదన్నారు.బీజేపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా పన్నులు విధించడంతో పేద, మధ్యతరగతి వర్గాల బతుకు కష్టంగా మారిందన్నారు.పాలపై పన్ను విధించడంతో పాడి రైతులందరూ నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు.కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ సామాన్యుల నడ్డి విరుస్తున్న మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్నారు.సీఎం కేసీఆర్ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు.కేంద్ర ప్రభుత్వం బేషరతుగా పాల ఉత్పత్తులపై జీఎస్టీని విరమించుకోవాలని డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు మంత్రి జగదీశ్ రెడ్డి నాయకత్వంలో పాడి రైతులకు, సామాన్యులకు అండగా ఉద్యమిస్తామని అన్నారు.