పాల కోసం ఏడ్చి.. తనువు చాలించి..

feztluns
పాలకోసం చిన్నారి గుక్కపట్టి ఏడుపు
మానవత్వం మరిచి ప్రవర్తించిన కాంట్రాక్టర్
తల్లిని పాలివ్వడానికి పంపని కాంట్రాక్టర్
గుట్టుచప్పుడు కాకుండా చిన్నారి ఖననం
హెచ్చరించి పరిశ్రమ నుంచి గెంటేసిన వైనం
ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన

నర్సాపూర్, హత్నూర(మెదక్): పొట్ట నింపుకోవడానికి వచ్చిన ఆ తల్లికి కడుపుకోతే మిగిలింది. ఉపాధి కోసం తన పిల్లలతో సహ ఓ పేద మహిళ వలస వచ్చి పరిశ్రమలో పనికి కుదిరింది. అక్కడ పరిశ్రమ యాజమాన్య నిర్లక్ష్యం సంబంధిత కాంట్రాక్టర్ నిరంకుశత్వానికి పసిగుడ్డు బలయ్యాడు. పాలకోసం పసిగుడ్డు గుక్కపట్టి ఏడ్చీ ఏడ్చీ ప్రాణాలొదిలాడు. ఆరునెలల కొడుకు చనిపోవడంతో జీర్ణించుకోలేక ఆ తల్లి పడుతున్న బాధను చూడలేక దయచూపాల్సిన పరిశ్రమ యాజమాన్యం ఆమెతో పాటు వలస వచ్చిన మరో ఏడుగురు కూలీలను గెంటేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హత్నూర మండలం నర్సాపూర్- సంగారెడ్డి ప్రధానరోడ్డుపై తుర్కలఖానాపూర్ శివారులోని ఎమ్మెన్నార్ ఫార్మ పరిశ్రమలో కొత్తగా మరో ప్లాంటును ఏర్పాటు చేయడం కోసం పనులు చేపట్టారు. ప్లాంటు కాంట్రాక్టు పనులు పొందిన వ్యక్తి మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం కాకర్లపాడుకి చెందిన కూలీలను తీసుకొచ్చి పనులు చేయిస్తున్నాడు. వీరిలో ఇద్దరు పురుషులు, ఆరుగురు మహిళలను కూలీపనుల కోసం పరిశ్రమ ఆవరణలోనే గుడిసెలు వేయించి నివాసముంచాడు.

అయితే మహిళా కూలీ మల్లేశ్వరి (35), భర్తతో మనస్పర్ధ్దలు రావడంతో తల్లిదండ్రులతో కలసి తన ముగ్గురు కూతుళ్లతో పాటు ఆరు నెలల బాలుడితో వచ్చి పని చేస్తుంది. రోజులాగే ఈ నెల 7న శనివారం గుడిసెలో బాబును పడుకోబెట్టి పని చేయసాగింది. చిన్నారికి మెలకువ వచ్చి పాలకోసం ఏడవసాగాడు. చిన్నకూతురు తల్లి వద్దకు వచ్చి చెప్పడంతో బాబుకు పాలు ఇవ్వడం కోసం వెళ్తానని సదరు కాంట్రాక్టర్‌ను కోరింది. అతను కనికరించలేదు. దీంతో చిన్నారి గుక్కపట్టి ఏడవ సాగాడు. ఒక్కసారిగా ఏడుపు చప్పుడు ఆగిపోవడంతో తల్లి వెళ్లి చూసే సరికి చిన్నారి మృతిచెందాడు. దీంతో తల్లి రోదించిన తీరును అక్కడున్న వారిని కలచివేసింది.

సదరు కాంట్రాక్టర్ ఈ విషయం బయటకు పొక్కకుండా పరిశ్రమలో ఇసుక, కంకర సరఫరా చేసే సబ్‌కాంట్రాక్టర్ సహాయంతో చిన్నారి శవం నర్సాపూర్ అటవీప్రాంతంలోని శ్మశానవాటికలో పూడ్చివేశారు. కాంట్రాక్టర్ నిరంకుశ ధోరణితోనే బిడ్డకు పాలు ఇవ్వకుండా చేశారని, తన బాబు చనిపోవడానికి అతడే కారణమని న్యాయం చేయాలని తల్లి రోదించసాగింది. ఈ విషయం బయట తెలిస్తే ఇబ్బందులు తలెత్తుతాయని పరిశ్రమ యాజమాన్యం మల్లీశ్వరితో పాటు, ఇతర కూలీలను బలవంతంగా బయటకు పంపించేశారు.

అంతేకాదు ఎక్కడైనాచెబితే చంపేస్తామని ఆమెను సదరు కాంట్రాక్టర్ బెదిరించినట్లు తెలిసింది. దిక్కుతోచనిస్థితితో ఆమె బోరున విలపిస్తూ ఇంటికి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయమై పరిశ్రమ జనరల్ మేనేజర్ శశికుమార్‌ను వివరణ కోరగా తనకు సంబంధం లేదని, దీనిపై విచారించి కాంట్రాక్టర్‌ను తొలగిస్తామని తెలిపారు.